జనతా కర్ఫ్యూ విజయవంతం అయింది. అలా ఇలా కాదు సూపర్ సక్సెస్ అయింది. దాని వెనకాల దేశ ప్రధాని మోడీ ఉన్నారు. ఆయన  మీద  తమకు ఉన్న నమ్మకాన్ని  మరో మారు భారతీయులు రుజువు చేసుకున్నారు. అది పాకిస్థాన్ తో యుధ్ధమైనా, కరోనాతో సమరమైనా కూడా మోడీ ఉంటే చాలు తమకు విజయమేనని దేశ  ప్రజలు  గట్టిగా నమ్ముతున్నారు. అందుకే మోడీ చెప్పిన మాటకు తుచ తప్పకుండా 130 కోట్ల మంది జనం ఇంట్లోనే ఉండిపోయారు. అలా దటీజ్ మోడీ అనిపించుకున్నారు.

 

సరే జనతా కర్ఫ్యూ చేశారు. అది గ్రాండ్ లెవెల్లో సక్సెస్ కావడమే కాదు, భిన్న మతాలు, కులాలు, ప్రాంతాల సమాహారంగా ఉన్న భారత్ ఐక్యత ఏంటో, సత్తా ఏపాటితో ప్రపంచం చూసేలా చేసింది. ఇక మోడీ తరువాత అడుగు ఏంటి అన్నది అటు ప్రపంచం కూడా గమనిస్తోంది. ఇంత పెద్ద జనాభాను కరోనా కాటు బారిన పడకుండా మోడీ ఎలా కాపాడుతారన్నది అగ్ర రాజ్యాలకు సైతం ఆసక్తిగానే ఉంది.

 

మోడీని జనం బాగా విశ్వసిస్తున్నారు. ఆయన మాటే వేదవాక్కు అనుకుంటున్నారు. అదే విధంగా మోడీయే తమను ఒడ్డున పడేస్తాడని కూడా కరోనా భయంతో భీతిల్లుతున్న జనం ఆశలు పెట్టుకుంటున్నారు. మరి మోడీ దగ్గర అలాంటి మంత్రం ఏదైనా ఉందా. మోడీ కరోనా రక్కసిని జయించగలరా. దేశానికి ఉపశమనం కలిగించగలరా అంటే మోడీ కూడా ఇపుడు 130 కోట్ల మంది జనం మీదనే ఆధారపడిఉన్నారు.

 

ఆయన ఈ కర్ఫ్యూ వల్ల చేసినదేంటి, సాధించిన విజయం ఏంటి అంటే కరోనా వైరస్ గురించి ప్రతీ ఇంటికీ పక్కా క్లారిటీగా చెప్పగలిగారు. జన సమూహంలోకి వెళ్తే మీకు కరోనా ముప్పు ఉంది అని బాగా  గట్టిగా చెప్పగలిగారు. ఆ విధంగా మోడీ సగం విజయం సాధించారు.

 

అదే సమయంలో జనాన్ని ఇంటిపట్టున ఉంచేలా అలవాటు చేయగలిగారు. పైగా ఇది మన కోసం మోడీ చెబుతున్న మంచి మాట అనిపించేలా చేయగలిగారు. ఇక మోడీ అసలైన యాక్షన్ ప్లాన్ ముందుంది. అందులో భాగంగా దేశంలో  ఉన్న 600 పై చిలుకు జిల్లాల్లో ఎనిమిదో వంతు జిల్లాలలో లాక్ డౌన్  ఇప్పటికి  తొలిదశగా విధించారు. ఇక మిగిలిన వాటిని దశలవారీగా చేస్తూ ముందుకు పోవాలన్నది కేంద్రం ఆలోచన‌గా ఉంది.

 

జనం మద్దతు ఎటూ ఉంది కాబట్టి వారికి ఇబ్బంది లేకుండా ఇలా కర్ఫ్యూ వాతావరణాన్ని కనీసంగా పదిహేను రోజులూ, గరిష్టంగా 40 రోజుల పాటు దేశమంతటా నిలిపి ఉంచాలని మోడీ భారీ వ్యూహంగా కనిపిస్తోంది. అదొక్కటే కరోనాని ఎదిరించే మార్గమని మోడీ అనుకుంటున్నారు. ఎందుకంటే భారత్ లాంటి అధిక జనాభా ఉన్న దేశాలలో వైద్య సేవలు పరిమితం. ఆసుపత్రులు, వైద్యులు కూడా అవసరానికి తగినట్లుగా లేరు. 

 

దాంతో జనాల్ని ఇళ్ళలో పెట్టి లాక్ డౌన్ చేయడం ద్వారానే పరిస్థితి చేయి జారకుండా చూడాలని మోడీ అనుకుంటున్నారు. జనతా కర్ఫ్యూ పేరిట తొలి అడుగు సక్సెస్ ఫుల్ గా పడింది కాబట్టి ఇక మోడీ వెనక జాతి నడిస్తే కరోనా నియంత్రణ  విషయంలో ఘన విజయం సాధించినట్లే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: