పాపం 2019 ఎన్నికలు అయిన దగ్గర నుంచి టీడీపీ అధినేత చంద్రబాబుకు వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. ఓ వైపు పార్టీ పరిస్తితి రోజురోజుకూ దిగజారుతూ వస్తుంటే, మరోవైపు నేతలు వరుస పెట్టి పార్టీని వీడిపోతున్నారు. ఇప్పటికే చాలామంది నేతలు పార్టీని వీడి వైసీపీ, బీజేపీల్లోకి వెళ్ళిపోయారు. ఇక మొన్న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏ విధంగా టీడీపీ నేతలు వైసీపీలోకి వలస వెళ్లారో చూశాం. ఏదో కరోనా వల్ల స్థానిక ఎన్నికలు వాయిదా పడటం వల్ల, టీడీపీ బ్రతికిపోయింది. లేదంటే ఇంకెంతమంది నేతలు టీడీపీని వీడేవారో చెప్పలేని పరిస్తితి ఉంది.

 

అయితే టీడీపీకి అతిపెద్ద షాక్ తగిలే రోజు మరొకటి ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలు బాబుకు షాక్ ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతుంది. ఈ నెల 26న రాజ్యసభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఏపీ నుంచి నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి, ఆ నాలుగు సీట్లు వైసీపీ ఖాతాలో పడనున్నాయి.

 

అయితే టీడీపీ నుంచి కూడా అభ్యర్ధి నిలపడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. లేదంటే నలుగురు వైసీపీ సభ్యులు ఏకగ్రీవమయ్యేవారు. బాబు కావాలనే వర్ల రామయ్య చేత నామినేషన్ వేయించారు. దీంతో ఏపీలో 175 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సిన పరిస్తితి ఉంది. ఒకవేళ కరోనా వల్ల ఎన్నికల వాయిదా పడిన, తర్వాతైన ఎన్నికలు జరగడం అనివార్యం.

 

ఈ ఎన్నికల్లో టీడీపీ తరుపున ఎంతమంది ఎమ్మెల్యేలు ఓటు వేస్తారనేది అర్ధం కాకుండా ఉంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీని వీడారు. దీంతో టీడీపీకి 20 మంది ఉన్నారు. మళ్ళీ వారిలో ఎంతమంది బాబుకు హ్యాండ్ ఇస్తారో చెప్పలేని పరిస్తితి ఉంది. ఎలా లేదన్న కొంతమంది ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు డుమ్మా కొట్టే అవకాశముందని తెలుస్తోంది. వారు ఓటింగ్‌కు దూరమైతే బాబుకు షాక్ ఇచ్చినట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి: