దాయాది దేశం పాకిస్థాన్‌ను కూడా కరోనా వైరస్‌ తీవ్రంగా కలిచివేస్తోంది. ఇప్పటి వరకూ ఐదు వందల మందికి పైగా కరోనాతో సతమతమవుతున్నారు. ప్రపంచ దేశాలతో పోల్చితే ఈ సంఖ్య చాలా తక్కువ. అయినా పాకిస్థాన్ మాత్రం వీళ్లకు సౌకర్యాలు కల్పించడానికే తీవ్ర ఇబ్బందులు పడుతోంది.

 

పాకిస్తాన్‌లో కరోనా బాధితుల సంఖ్య 530 దాటింది. శనివారం నాటికి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సింధ్ ప్రావిన్స్‌లో అత్యధికంగా 250 మందికి పైగా కరోనా వైరస్‌ సోకి బాధపడుతున్నా్రు. ఆ తర్వాత పంజాబ్, బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లలో కరోనా బాధితుల సంఖ్య వంద దాటింది. గిల్గిట్‌, ఖైబర్‌ ప్రావిన్స్‌లలో కూడా వైరస్‌ సోకిన వారు పదుల సంఖ్యలో ఉన్నారు. తొలిసారిగా ఫిబ్రవరి 26వ తేదీన పాకిస్తాన్‌లో కరోనా వైరస్ బయటపడింది. మార్చి 15 వరకూ రెండంకెల సంఖ్యకే పరిమితమైన బాధితులు.. ఆ తర్వాత మాత్రం విపరీతంగా పెరిగిపోయారు. రోజుకు సరాసరిన వంద మందికి కరోనా సోకుతోంది. దీంతో ఆ దేశం తలలు పట్టుకుంటోంది.

 

కరోనా పాజిటివ్ కేసులను పక్కనపెడితే కరోనా లక్షణాలతో బాధపడుతున్నవారు 4వేలకు పైగానే ఉన్నారని ప్రధాన మంత్రి ఆరోగ్య సలహాదారు జాఫర్‌ మీర్జా వెల్లడించారు. వీరందరికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ రిపోర్టులు వస్తే కానీ వీరి పరిస్థితి ఏంటనేది చెప్పలేం. ప్రస్తుతానికి వీరంతా ఐసోలేషన్ కేంద్రాలు, క్వారంటైన్ కేంద్రాల్లో తల దాచుకుంటున్నారు. ముఖ్యంగా పొరుగుదేశమైన ఇరాన్‌ నుంచి 3వేల 3వందలమందికి పైగా పాకిస్తాన్ వచ్చారు. వీరందరినీ సరిహద్దులోని క్వారంటైన్ క్యాంప్‌కు తరలించారు. 

 

పాకిస్తాన్‌లో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు 14 చోట్ల ల్యాబొరేటరీలను ఏర్పాటు చేశారు. కరోనా వైరస్‌ కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు, ప్రభుత్వానికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా పరిస్థితిని ఈ కమిటీ సమీక్షించి చర్యలు చేపడుతోంది.

 

పాకిస్తాన్‌ ప్రజలకు సరిపడా పరీక్షా కేంద్రాలు, కిట్స్‌ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వైరస్‌ను అదుపు చేయడంలో భాగంగా పలు ఆంక్షలు విధించింది. ప్రజలంతా స్వీయ నిర్బంధంలో ఉండాలని, పరిస్థితి చేయిదాటకుండా సహకరించాలని పదేపదే విజ్ఞప్తి చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: