రాజకీయాల్లో విలువలు పాటించడంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడు ముందువరుసలోనే ఉంటారు. ఇతర పార్టీల నేతలనీ, తమ పార్టీలో చేర్చుకునే విషయంలో ముందు నుంచి జగన్ విలువలు పాటిస్తూ వస్తున్నారు. చంద్రబాబు మాదిరిగా ఎమెల్యేలని సంతల్లో గొడ్డు మాదిరిగా పార్టీలోకి తీసుకోవడం లేదు. ఒకవేళ అలాంటి పని జగన్ చేస్తే ఈ పాటికే టీడీపీ క్లోజ్ అయిపోయేది. జగన్ కనీసం విలువలు పాటించడం వల్లే, ఇంకా టీడీపీలో 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

 

ఇక ఏదో ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రం టీడీపీలో ఉండమని చెప్పి, పరోక్షంగా జగన్‌కు మద్ధతు ఇస్తున్నారు. అయితే భవిష్యత్‌లో కూడా ఎవరైనా ఎమ్మెల్యేలు టీడీపీని వీడితే, ఈ మాదిరిగానే స్వతంత్రంగానే ఉంటారు. ఇక ఎమ్మెల్యేల విషయం పక్కనబెడితే ఎమ్మెల్సీల విషయంలో జగన్ కాస్త దూకుడుగానే వెళుతున్నట్లు కనిపిస్తోంది. టీడీపీ బాగా బలంగా ఉన్న మండలిని రద్దు చేసిన దగ్గర నుంచి, ఎమ్మెల్సీలపై బాగా దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.

 

నిదానంగా ఒక్కో ఎమ్మెల్సీని పార్టీలోకి తీసుకుంటున్నారు. అయితే వారిలో కొందరు పదవికి రాజీనామా చేసి వస్తుండగా, మరికొందరు మాత్రం రాజీనామా చేయకుండానే వైసీపీ కండువాలు కప్పుకుంటున్నారు. ఎలాగో మండలి రద్దు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి, పదవులకు రాజీనామా చేయించకుండానే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డొక్కా మాణిక్యవరప్రసాద్, పోతుల సునీత, శివనాథరెడ్డి, శమంతకమణిలు వైసీపీ వైపు వచ్చారు. అటు కేఈ ప్రభాకర్ కూడా టీడీపీని వీడారు.

 

అయితే టీడీపీకి మరింత డ్యామేజ్ చేయాడానికి జగన్ మరింత దూకుడు ప్రదర్శించవచ్చని ప్రచారం జరుగుతోంది. మరికొందరు ఎమ్మెల్సీలని వైసీపీ వైపు లాగేసే అవకాశముందని తెలుస్తోంది. దాదాపు 5 మందిపైనే ఎమ్మెల్సీలు వైసీపీలోకి వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. అలా ఎమ్మెల్సీలు కూడా పార్టీని వీడితే టీడీపీకి గట్టి దెబ్బ పడుతుంది. ఫలితంగా టీడీపీ మరింత వీక్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: