కరోనా వైరస్‌ కట్టడి కోసం పాకిస్థాన్ అనేక చర్యలు చేపడుతోంది. స్కూళ్లు, థియేటర్లు బంద్‌ చేసింది. పవిత్ర ప్రదేశాలను మూసివేసింది. ఎయిర్‌ పోర్ట్‌లను క్లోజ్ చేసింది. ఐసోలేషన్ కేంద్రాలతో పాటు క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వైద్యులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించింది. అయినా అది ఇప్పట్లో కంట్రోల్‌లోకి వచ్చే పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదు.

 

పాకిస్తాన్‌కు ఇరాన్ పొరుగుదేశం. ప్రపంచంలో అత్యధికంగా కరోనా బాధితులన్న దేశాల్లో ఇరాన్ నాలుగో స్థానంలో ఉంది. ఇరాన్‌ నుంచి తొలిసారి ఫిబ్రవరి చివర్లో పాకిస్తాన్‌లోకి కరోనా ప్రవేశించింది. అప్పటి నుంచి కరోనాను కట్టడి చేసేందుకు పాకిస్తాన్ అనేక ప్రయత్నాలు చేస్తోంది. స్కూళ్లు, థియేటర్లు, మాల్స్‌ బంద్‌ చేసింది. ప్రజా రవాణాపై కూడా ఆంక్షలు విధించింది. అంతర్జాతీయ విమానాలను రద్దు చేసింది. ఏప్రిల్ 15 వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది. దేశీయంగా అన్ని విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.

 

స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం పరీక్షలు వాయిదా వేసింది. ప్రార్థనా మందిరాలను కూడా మూసివేసింది. విదేశాల నుంచి వచ్చే వారికోసం క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ఇరాన్‌ నుంచి పెద్ద ఎత్తున వస్తున్నవారికోసం సరిహద్దు సమీపంలోని తాఫ్తాన్ వద్ద తాత్కాలిక క్వారంటైన్ క్యాంప్‌ ఏర్పాటు చేసింది. అంతేకాక.. విదేశాల నుంచి వచ్చిన పలువురిని ఇళ్లలోనే స్వీయనిర్బంధం విధించుకోవాలని సూచించింది. అలాంటివారందరికీ ఆహారాన్ని సరఫరా చేస్తామని చెప్పింది.

 

దేశవ్యాప్తంగా 14 ల్యాబొరేటరీలను ఏర్పాటు చేసిన పాక్ ప్రభుత్వం.. ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా ఉచితంగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. అయితే ప్రైవేటు ఆసుపత్రులు ప్రభుత్వ హెచ్చరికలను ఏమాత్రం పాటించడం లేదు. లాహోర్‌లోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు ఒక్కో పరీక్షకు 9వేల రూపాయలు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఇది ఆ దేశ ప్రజలకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. 

 

క్వెట్టాలో 9 విద్యాసంస్థలను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చారు. తాఫ్తాన్‌లోని క్వారంటైన్ కేంద్రాలు నిండిపోవడంతో ప్రభుత్వానికి దిక్కు తోచట్లేదు. దీంతో విద్యాసంస్థలను క్వారంటైన్‌ సెంటర్స్‌గా మార్చక తప్పలేదు. అంతేకాదు.. వైద్యులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే చికిత్స చేసేందుకు వైద్యులు ముందుకు రావడంలేదు. వారికి సరైన రక్షణ పరికరాలు లేకపోవడమే కారణం. ఈ విషయం తెలుసుకున్న అలీబాబా గ్రూప్ కో ఫౌండర్‌ జాక్‌ మా అత్యవసర వైద్య పరికరాలను అందించేందుకు ముందుకొచ్చారు.

 

పాకిస్తాన్ దయనీయ పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్‌మెంట్‌ బ్యాంక్ ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చాయి. 588 మిలియన్ డాలర్ల సాయం చేస్తాయని ప్రకటించాయి. విదేశాలు సాయం చేస్తే తప్ప కరోనాను ఎదుర్కొనేంత సత్తా పాకిస్తాన్‌కు ఇప్పుడు లేదు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైతే సైన్యం కూడా రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉందని ఆర్మీ చీఫ్ ప్రకటించారు. పౌర సమాజానికి సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: