కరోనాను ఎదుర్కోవడంలో పాకిస్తాన్ వహించిన నిర్లక్ష్యమే ఇప్పుడు ఆ దేశం పాలిట శాపంగా మారింది. మూడు వారాలపాటు ఏమాత్రం పట్టించుకోని ఆ దేశ ప్రభుత్వం చివరి నిమిషంలో మేల్కొంది. పైగా కరోనా వ్యాప్తికి కారణమైందని ప్రపంచ దేశాలు మొత్తం చైనాను వెలేసిన సమయంలో పాక్ ప్రధాని ఆ దేశంలో పర్యటించడం మరిన్ని ఆగ్రహావేశాలకు కారణమైంది.

 

పాకిస్థాన్‌లో వ్యాధి సోకిన వారిలో ఎక్కువ మంది పక్కనే ఉన్న ఇరాన్‌ నుంచి వచ్చినవారే! చైనా, ఇటలీ తర్వాత ఎక్కువ మంది కరోనా బాధితులున్నదేశం ఇరానే! పక్కనే ఉన్న ఇరాన్‌.. పాకిస్తాన్‌కు  ఇప్పుడు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పాకిస్తాన్, ఇరాన్‌ మధ్య సుమారు 6వందల కిలోమీటర్ల సరిహద్దు ఉంది. వాణిజ్యపరంగా మంచి సంబంధాలున్నాయి. పర్యాటకపరంగా, ఆధ్యాత్మికపరంగా రెండు దేశాల మంది నిత్యం వేలాది మంది ప్రయాణిస్తుంటారు.   

 

ఇరాన్‌ నుంచి వస్తున్నవారందరినీ తాఫ్తాన్‌ సరిహద్దులో ఏర్పాటు చేసిన క్యాంప్‌కు తరలిస్తున్నారు. అయితే అక్కడ పరిస్థితి దారుణంగా ఉన్నట్టు తెలుస్తోంది. సుమారు 6వేల మందికి పైగా అక్కడి క్వారంటైన్‌ క్యాంప్‌లో  ఉన్నట్టు సమాచారం. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన టెంట్లలోనే వారంతా తలదాచుకుంటున్నారు. టాయిలెట్లు కూడా లేకపోవడంతో అక్కడున్నవారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్నానం చేసేందుకు  నీళ్లులేక, కప్పుకోవడానికి దుప్పట్లు లేక నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ కేంద్రంలో ఇరాన్‌ నుంచి వచ్చిన వారికి ఆశ్రయం కల్పించడం ద్వారా దేశంలో కరోనా వ్యాపించకుండా కట్టడి చేయవచ్చనేది ప్రభుత్వం  ఆలోచన. కానీ ప్రభుత్వ ఉద్దేశం నెరవేరే పరిస్థితి మాత్రం అక్కడ కనిపించడం లేదు. జైలు కంటే అది దారుణంగా ఉందని అక్కడ రెండువారాల పాటు తలదాచుకుని వచ్చినవారు చెప్తున్నారు. జంతువుల కంటే అక్కడ  హీనంగా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస సౌకర్యాలు కూడా లేవని, అక్కడున్నవారు మానవత్వం కూడా చూపించట్లేదని మండిపడుతున్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా అరికట్టేందుకు అవసరమైన  కనీస జాగ్రత్తలు కూడా అక్కడ పాటించట్లేదు.

 

క్యాంపుల్లో ఉన్నవాళ్లకు కరోనా లక్షణాలున్నా కూడా వారికి పరీక్షలు చేసే సౌకర్యం కానీ, వారిని ఐసోలేట్‌ చేసే అవకాశం కానీ లేదని అక్కడి వైద్యులే చెప్తున్నారు. ఎందుకంటే వారిని చూసుకునేందుకు అవసరమైన  డాక్టర్లు కానీ, నర్సులు కానీ లేకపోవడమే! మొదటి మూడువారాలు క్యాంపుల్లో ఎవరికీ ఎలాంటి పరీక్షలు చేయలేదని వైద్యులు చెప్తున్నారు. ఓ బాలుడు తీవ్ర అనారోగ్యానికి గురవడంతో ఆసుపత్రికి పంపినప్పుడు  కరోనా పాజిటివ్ తేలింది. అప్పటివరకూ క్యాంప్‌లో ఎవరికీ పరీక్షలు నిర్వహించలేదు. క్యాంపులో ఎంతోమంది బీపీ, షుగర్‌లతో బాధపడుతున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా వారికి తెలియజేయలేదు. అంతేకాదు క్యాంపులో ఉన్నవారంతా సమీపంలోని మార్కెట్లకు వెళ్లి తమకు అవసరమైన వస్తువులను యధేచ్ఛగా తెచ్చుకుంటున్నారు. అక్కడ ఎలాంటి  నిర్బంధం లేకపోవడంతో సమీపంలోని ప్రజలంతా భయపడుతున్నారు. మరోవైపు చైనా సరిహద్దులోని పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో పనిచేస్తున్న పలువురి పరిస్థితి కూడా దయనీయంగా మారింది. చైనీయులతో కలిసి వీరంతా పనిచేయడంతో ఇప్పుడు వీరందరికీ పరీక్షలు  నిర్వహించాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. కేవలం క్యాంపులోనే కాదు.. బలూచిస్తాన్‌లోని ఆసుపత్రుల్లో కూడా పరిస్థితి దారుణంగా ఉంది.. కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తే చాలు డాక్టర్లే వైద్యం చేయకుండా పారిపోతున్నారు. ఎవరూ వైద్యం చేసేందుకు ముందుకు  రాకపోవడంతో ఓ బాలిక కన్నుమూసింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించాలనే డిమాండ్‌ సర్వత్రా వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా కర్ఫ్యూలాంటి పరిస్థితి విధించాలని పలువురు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: