కరోనా వైరస్ కట్టడికి కేవలం లాక్ డౌన్ చేస్తే సరిపోతుందన్న అపోహ లో ప్రభుత్వాలు ఉన్నట్లు కన్పిస్తోంది .  కేవలం  లాక్ డౌన్ వల్లే కరోనా వ్యాధి విస్తృతిని అడ్డుకోలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు హెచ్ ఓ ) ప్రతినిధి మైక్ ర్యాన్ పేర్కొన్నారు . వైరస్ తిరిగి పుంజుకోకుండా ఉండాలంటే , ఆయా దేశాలు చేపట్టే ప్రజారోగ్య చర్యలు కీలకమని ఆయన  చెప్పారు . కరోనా బాధిత దేశాలు , వ్యాధి సోకిన వారిని గుర్తించి ఐసోలేషన్ వార్డుకు తరలించడం పై దృష్టి సారించాలని సూచించారు  .

 

లాక్ డౌన్ ల వల్ల వైరస్ విస్తృతిని అడ్డుకోలేమన్న ఆయన , తరువాత సరైన సంరక్షణ చర్యలు తీసుకోకపోతే ఆ లాక్ డౌన్ లే మరింత  ప్రమాదకరంగా పరిణమించే అవకాశాలు లేకపోలేదని హెచ్చరించారు . చైనా , సింగపూర్ , దక్షిణ కొరియా దేశాలు వైరస్ సోకిన వారిని వేగంగా గుర్తించాయని , ఆ దేశాలను ఆదర్శంగా తీసుకుని మిగతా దేశాలు ముందుకు వెళ్లాలని మైక్ ర్యాన్ హితవు పలికారు  . లాక్  డౌన్ ల ద్వారా వైరస్ విస్తృతిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు ఒక భాగమైతే , వ్యాధి గ్రస్తులను గుర్తించి ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందించడమన్నది కరోనా కట్టడిలో కీలకమని నిపుణులు చెబుతున్నారు .

 

 తొలుత కరోనా కట్టడిలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన రెండు తెలుగు రాష్ట్రాలు , ప్రస్తుతం పూర్తిగా అప్రమత్తమై ఈ నెల 31 వరకు  లాక్ డౌన్ ప్రకటించాయి . అయితే మార్చి మొదటి వారం లో విదేశాల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు చేరుకున్న వారిని గుర్తించి వారికి వ్యాధి ఉందా?, లేదా ?? అన్నది నిర్ధారించుకోవడమన్నది ఇప్పుడు   కీలక ప్రక్రియ అని సూచిస్తున్నారు .  ఒకవేళ వారికి గనుక వ్యాధి ఉంటే వారు ఎక్కడెక్కడ తిరిగారు .. వారిద్వారా ఇతరులు ఎంతమందికి   వైరస్ సోకిందన్నది మరింత కీలకం కానుందని పేర్కొంటున్నారు . ఇప్పుడు రెండు తెలుగురాష్ట్రాల ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తున్న అంశమే ఇదేనని  నిపుణులు చెబుతున్నారు .  

మరింత సమాచారం తెలుసుకోండి: