తగిన సమయంలో తగిన విధంగా స్పందించకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే.. కరోనా వైరస్ వ్యాప్తిలో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు రెండో దశలోకి వెళ్తున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ రెండో దశ కేసులు నమోదయ్యాయి. ఈ సమయంలో జనం సరిగ్గా స్పందించకపోతే.. మూడో, నాలుగో దశలు వేగంగా వస్తాయి. అప్పుడు కరోనాను ఆ దేవుడు కూడా ఆపలేడు.

 

 

జనం ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల్లో 14 రోజుల్లో జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల తలెత్తితే కరోనా వైరస్‌గా అనుమానిస్తారు. సాధారణంగా వైరస్‌ రెండు నుంచి 14 రోజుల్లో బయటపడుతుంది. తుంపర్లు, ముట్టుకోవడం వల్ల ఒకరి నుంచి మరొకరికి విస్తరిస్తుంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది.

 

 

అందుకే సాధ్యమైనంత వరకు జన సమూహానికి దూరంగా ఉండాలి. జనంలోకి తప్పనిసరై వెళ్లాల్సి వస్తే.. ముక్కుకు మాస్కులు ధరించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం చేయాలి. స్వీయ నియంత్రణే చాలా ముఖ్యమన్న సంగతి గుర్తుంచుకోవాలి. ముందే మేల్కొని ఎవరికి వారు స్వీయ నియంత్రణ చర్యలు చేపడితే..వైరస్‌ భారీ నుంచి సులభంగా బయటపడొచ్చంటున్నారు నిపుణులు.

 

 

కరోనాను ఇంకా చాలా మంది లైట్ గా తీసుకుంటున్నారు. మనదాకా ఏం వస్తుందిలే అనుకుంటున్నారు.. మనం బాగానే ఉన్నాం కదా అనుకుంటున్నారు. ఇలాంటి నిర్లక్ష్యమే ఇటలీ వంటి దేశాల కొంపలు ముంచింది. ఇప్పుడు అక్కడ దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అది తెలుగు రాష్ట్రాలకు రాకూడదంటే తగిన జాగ్రత్తలు పాటించాల్సిందే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: