దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణలో 27 కేసులు నమోదు కాగా ఏపీలో 6 కేసులు నమోదయ్యాయి. ప్రధాని మోదీ కరోనా కట్టడి చర్యల్లో భాగంగా జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మోదీ పిలుపుకు గ్రామాల నుంచి నగరాల వరకు విశేష స్పందన కనిపించింది. ప్రజలు స్వచ్చందంగా జనతా కర్ఫ్యూని పాటించారు. జనతా కర్ఫ్యూ పొడిగించాలనే ఉద్దేశంతో పలు రాష్ట్రాలు నిబంధనలలో మార్పులు చేసి ఈ నెల31 వరకు లాక్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటన చేశాయి. 
 
రాజస్తాన్, పంజాబ్, ఏపీ, తెలంగాణ, ఇతర రాష్ట్రాలు ఈ నెల 31 వరకు లాక్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ రాష్ట్రాలలో అత్యవసర సేవలు మినహా ఇతర సేవలు ప్రజలకు అందుబాటులో ఉండవు. మరికొన్ని రాష్ట్రాలు జనతా కర్ఫ్యూను పొడిగించాయి. మధ్యప్రదేశ్ ఈ నెల 24 వరకు జనతా కర్ఫ్యూ పాటించాలని నిర్ణయం తీసుకుంది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో ఈరోజు సాయంత్రం వరకు కర్ఫ్యూ కొనసాగించనున్నారు. 
 
రైల్వే శాఖ ఈ నెల 31 వరకు అన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. తెలుగు రాష్ట్రాల్లో బస్సులు, ఆటోలు, ఇతర వాహనాలను నడపరాదని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని... అవసరమైతే మత్రమే ఇంటి నుంచి బయటకు రావాలని సూచించాయి. కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా కేంద్రం ఇప్పటికే పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. 
 
రోజురోజుకు దేశంలో పరిస్థితులు తీవ్రం కావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం వల్ల వైరస్ వ్యాప్తి తగ్గుతుందని.. కరోనా నివారణకు ఇదే సరైన మార్గం అని రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించినా పదో తరగతి పరీక్షలు మాత్రం షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని సీఎం స్పష్టం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: