కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచమంతా అతలాకుతలం అయిపోతోంది. అగ్రరాజ్యాలమని చెప్పుకుని చాలా దేశాలే వణికిపోతున్నాయి. వైరస్ కు పుట్టినల్లయిన చైనా దాని తర్వాత ఇటలీ, ఇరాన్ లాంటి దేశాల్లో అయితే వైరస్ మూడో దశ కూడా దాటేయటంతో మరణాల సంఖ్య పెరిగిపోతోంది. పైగా దేశాల్లో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరిగిపోతుంటే ఇతర దేశాల్లో టెన్షన్ రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇంత జరుగుతున్నా ఒకే ఒక దేశానికి సంబంధించిన వివరాలు మాత్రం ఎక్కడా వినిపించటం లేదు. అదే ఉత్తర కొరియా.

 

కిమ్ జాంగ్ నియంతృత్వంలో ఉన్న ఉత్తర కొరియాలో ఏమి జరుగినా బయటప్రపంచానికి ఏ విషయం కూడా తెలీదు. ఇప్పుడు కరోనా వైరస్ వ్యవహారం కూడా ఇలాగే ఉంది. ప్రపంచ దేశాల్లో వైరస్ పాజిటివ్ కేసులు, మరణాలు పెరిగిపోతుంటే ఉత్తరకొరియాలో మాత్రం ఒక్క కేసు కూడా లేదని చెప్పటం ప్రపంచదేశాలను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. ఉత్తరకొరియా అధికారికంగా చేసిన  ప్రకటనను ప్రపంచదేశాలు నమ్మటం లేదు. నమ్మటం లేదు సరే మరి అసలు నిజమేంటి ? ఇది తెలీకే గింజుకుపోతున్నాయి.

 

పోనీ ఉత్తరకొరియా మొత్తం మీద ఒక్క కేసు కూడా నమోదు కాకపోతే  అందుకు కారణం ఏమిటో ప్రపంచదేశాలకు తెలియజేస్తే మిగితా దేశాలు కూడా  దాన్నే ఫాలో అవుతాయి కదా ? అని అనుకుంటున్నాయి. పక్కనే ఉన్న ధక్షిణకొరియాలో సుమారు 9 వేలమందికి వైరస్ సోకితే 110 మంది మరణించినపుడు ఉత్తరకొరియాలో మాత్రం వైరస్ ఎందుకు సోకకుండా ఉంటుంది ? అన్నదే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్న ప్రశ్న.

 

సరే ఈ విషయాలను పక్కనపెట్టేస్తే అసోసియేషన్ ఆఫ్ నార్త్ కొరియా డిఫెక్టర్స్ సీయే జో వ్యూంగ్ ప్రకారం ఉత్తరకొరియాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారట. ఉత్తరకొరియాలో మెడికల్ సిస్టమ్స్ చాలా బలహీనంగా ఉంది కాబట్టి ఇప్పటికే కరోనా కేసులు వందల్లో ఉండుంటాయని ఆయన అనుమానం. మిగిలిన వ్యాధుల్లాంటిదే కరోనా కూడా అనే అభిప్రాయంతో ఉన్న కారణంగా వందలాదిమంది చనిపోయుంటారని అంటున్నారు.

 

అలాగే ఉత్తరకొరియాలోని ఎన్జీఓలో పని చేసిన రాబర్ట్ లాలర్ చెప్పిన ప్రకారం దాదాపు మూడు నెలల క్రితమే 30 మంది పౌరులు, 200 మంది సైనికులు చనిపోయారట. ఇలా ఒక్కోరు ఒక్కో విధంగా చెబుతున్నా అవేవీ నిర్ధారణ కావటం లేదు. దీనికంతటి కారణం ఏమిటంటే ప్రభుత్వం అనుమతి లేకుండా ఎవరైనా ఏదైనా రాస్తే కాల్చి చంపేస్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుకుంటున్నారని తెలిసినా అంతే సంగతులు. ఇలాంటి దేశం నుండి కరోనా వైరస్ వాస్తవ పరిస్ధితులు బయటకు వస్తాయా ? మొత్తంమీద ఉత్తరకొరియా వ్యవహారం ప్రపంచదేశాలకు పెద్ద పజిల్ లాగ తయారైంది.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: