ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించేందుకు కేరళ ప్రభుత్వం వినూత్న చర్యలు చేపట్టింది. స్థానిక స్టార్టప్‌ సంస్ధ రెండు రోబోలను ఇందుకు వినియోగించింది. ఇవి అందిస్తున్న సేవలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు లభిస్తున్నాయి.    రోబోలతో కొవిడ్‌-19పై అవగాహన కల్పించటంతో పాటు, ప్రజలకు స్వయంగా మాస్కులను అందిస్తోంది.  హ్యూమనాయిడ్‌ రోబోలతో కరోనా వ్యాపించిన వారికి వైద్య సహాయం కూడా చేయవచ్చని చెబుతోంది. ఇప్పటికే కరోనా వైరస్‌ అనేక దేశాలలో మరణ మృందంగం మోగిస్తుండగా, వేల సంఖ్యలో ప్రజలు మృతిచెందారు. ఈ రోబోలకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్‌ ఎంపి శశిథరూర్‌ షేర్‌ చేశారు. కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌ ద్వారా పనిచేసే ఈ యంత్రాల పనితీరు ఆ వీడియోలో ఉంది. 

 

ఈ నేపథ్యంలో వైద్యులకు, సిబ్బందికి ఇబ్బందులు తలెత్తకుండా కేరళ ప్రభుత్వ అనుబంధ సంస్థ రోబోల అంశం తెరపైకి తీసుకొచ్చింది.  వైద్యం అందించటం కోసం హ్యూమనాయిడ్‌ రోబోలను రంగంలోకి దించింది. రెండు రోబోలను అభివృద్ధి చేసిన ఈ కేరళ స్టార్టప్‌ మిషన్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం కరోనా వైరస్‌కు సంబంధించిన అన్ని విషయాలను వాటిలో పొందుపరిచింది.  అసిమోవ్‌ రోబోటిక్స్‌ వ్యవస్థాపక సిఇఓ జయ కృష్ణన్‌ టి ఈ వీడియోలో కనిపిస్తారు. ఈ రోబోలు కోవిడ్‌-19కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమే కాకుండా సమాచారంతో కూడిన వీడియోలను కూడా చూపిస్తాయని ఆయన చెప్పారు.

 

ఈ రోబోలను ప్రజా బాహుళ్యం కలిగిన వివిధ ప్రదేశాలలో ఉంచాలన్న ఆలోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ వీడియోను షేర్‌ చేసిన కొద్ది గంటల వ్యవధిలోనే 78 వేల మంది చూశారు. ఈ ప్రయత్నాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. సెన్సార్‌ ఆధారిత శానిటరీలను ప్రభుత్వం పంపిణీ చేయాలని మరి కొంతమంది భావించారు. రోబోలు తమ పనిని ఎంతో నైపుణ్యంగా చేస్తున్నాయి. ప్రజలు వాటిని పాటిస్తున్నారా లేదా అనేది ముఖ్యం అంశం అంటున్నారు నెటిజన్లు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: