భారత్ లో కరోనా మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మహారాష్ట్ర రాష్ట్రంలోని ముంబైలో చికిత్స పొందుతూ 68 ఏళ్ల ఫిలిఫ్ఫీన్స్ వ్యక్తి మృతి చెందాడు. దీంతో కరోనాతో మహారాష్ట్రలో చనిపోయిన వారి సంఖ్య 3కు చేరగా భారత్ లో 8కు చేరింది. దేశంలో కరోనా బాధితుల సంఖ్య 390కు చేరింది. ఈరోజు చనిపోయిన వ్యక్తి కరోనా నుంచి కోలుకున్న తర్వాత చనిపోయినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. 
 
దేశంలో రోజురోజుకు కరోనా వేగంగా విజృంభిస్తోంది. మహారాష్ట్రలో పరిస్థితి చేయిదాటిపోతుందని తెలుస్తోంది. మహారాష్ట్రలో ఇప్పటివరకూ 89 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం రాష్ట్రంలో 144 సెక్షన్ విధించినా పరిస్థితులు అదుపులోకి రావడం లేదు. కేంద్రం పలు జిల్లాల్లో కేసుల వివరాలను ప్రకటించాల్సి ఉంది. కరోనా కట్టడిలో భాగంగా పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. 
 
ప్రభుత్వ ఆంక్షల ప్రభావం పేదలపై పడకుండా ప్రభుత్వాలు ఆర్థిక సాయం ప్రకటించాయి. కేంద్రం కరోనా కట్టడి చర్యల్లో భాగంగా నిన్న సాయంత్రం 75 జిల్లాలను లాక్ డౌన్ చేయాలని ప్రకటించింది. ముఖ్యమంత్రులు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. తెలంగాణలో పేదవారిని ఆదుకోవడానికి తెల్లరేషన్ కార్డుదారులందరికీ నిత్యావసర వస్తువులతో పాటు 1500 రూపాయలు ఇస్తానని కేసీఆర్ ప్రకటించారు. 
 
సీఎం జగన్ నిత్యావసరాలతో పాటు 1000 రూపాయలు నగదు ఇవ్వనున్నట్లు ప్రకటన చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీలో ఆందోళనకారులు వేదికల్ని ఖాళీ చేశారు. రైల్వే శాఖ ఈ నెల 31 వరకు అన్ని రైళ్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటన చేసింది. ప్రధాని మోదీ పిలుపుమేరకు ప్రజలు నిన్న జనతా కర్ఫ్యూలో భాగంగా ఇళ్లకే పరిమితమయ్యారు. స్వచ్ఛందంగా ఇళ్లలో ఉండి కర్ఫ్యూను విజయవంతం చేశారు.                               

మరింత సమాచారం తెలుసుకోండి: