కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచదేశాలు విదేశీయులను బలంతంగా పంపించేస్తున్నాయి. ఇందులో భాగంగానే భారత్ లో ఇప్పటి వరకూ బయపడిన కరోనా వైరస్ బాధితుల్లో అత్యధికులు  విదేశాల నుండి వచ్చిన వారే. ఇందులో భాగంగానే ఇటు తెలంగాణా అటు ఏపిలో కూడా విదేశాల నుండి వచ్చేస్తున్నారు.  గల్ఫ్ దేశాల నుండి  రాయలసీమకు 3833 మంది వచ్చారు. ఒకేసారి ఇన్ని వేలమంది రాయలసీమలోని నాలుగు జిల్లాలు చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురంకు రావటంతో స్ధానికులు టెన్షన్ పడిపోతున్నారు.

 

ఇలా గల్ఫ్ దేశాల నుండి రాయలసీమకు వచ్చిన వారిలో కూడా ఎక్కువగా కడప జిల్లాకే వచ్చిన వారే ఎక్కువట. మొత్తం 3833 మందిలో కడప జిల్లాకు వచ్చిన వారే 2150 మంది ఉన్నారట. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాష్ట్రంలో బయటపడిన కరోనా వైరస్ కేసులలో రాయలసీమ నుండి ఒక్కటి కూడా లేదు. ఒక్క కేసు కూడా బయటపడకపోయినా ఇలా వచ్చిన వారిలో  483 మందిని  28 రోజుల పాటు క్వారంటైన్ సెంటర్లలో ఉంచి తర్వాత పంపేశారు.

 

ఇక మిగిలిన 3522 మందిని వైద్య, ఆరోగ్య శాఖ సూచనల ప్రకారం గృహనిర్బంధంలోనే ఉండమని గట్టిగా చెప్పింది ప్రభుత్వం. వీరి కదలికలపై పోలీసులు గట్టి నిఘా ఉంచినట్లు సమాచారం. గల్ఫ్ నుండి వచ్చిన వారిలో 49 మందికి ఫ్లూ లక్షణాలు కనిపించినా ఎందుకైనా మంచిదని వీళ్ళని కూడా క్వారంటైన్ సెంటర్లలోనే ఉంచి అబ్జర్వ్ చేస్తున్నారు. 46 మందికి నెగిటివ్ రిపోర్టు రాగా మరో ముగ్గురికి చేసిన పరీక్షల రిజల్ట్స్ రావాల్సుంది.

 

అదే సమయంలో తెలంగాణాలో మాత్రం విదేశాల నుండి ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుండి వచ్చిన వాళ్ళ వల్ల కూడా వైరస్ సోకింది. ఈ కారణంతోనే గల్ఫ్ దేశాల నుండి వస్తున్నారంటేనే ప్రభుత్వం, జనాలు భయపడిపోతున్నారు. సోమవారం ఉదయం ముంబాయి-తెలంగాణా సరిహద్దుల్లో గల్ఫ్ నుండి వస్తున్న వారిని రాష్ట్రంలోకి తెలంగాణా పోలీసులు అనుమతించలేదు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: