కరోనా వైరస్ ఎఫెక్ట్  వల్ల  గుంటూరు జిల్లా పరిస్ధితి విచిత్రంగా తయారైంది. కేంద్రప్రభుత్వం ప్రకటించిన  లాక్ డౌన్ జిల్లాల జాబితాలో గుంటూరు జిల్లా లేకపోయినా లాక డౌన్ అయిపోయింది. కేంద్రం ఏపిలోని  ప్రకాశం, విశాఖపట్నం, కృష్ణా జిల్లాలను లాక్ డౌన్ గా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ విచిత్రమేమిటంటే  చుట్టుపక్కలున్న జిల్లాలన్నీ లాక్ డౌన్ అయిపోవటంతో గుంటూరు జిల్లా కూడా ఆటోమేటిక్ గా లాక్ డౌన్ అయిపోయింది.

 

ఇక్కడ విషయం ఏమిటంటే గుంటూరు జిల్లాకు సరిహద్దులుగా ఏపిలోని ప్రకాశం, విజయవాడతో పాటు తెలంగాణాలోని నల్గొండ, మిర్యాలగూడ జిల్లాలు సరిహద్దులుగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. పైగా తెలుగు రాష్ట్రాలు ఈనెల 31వ తేదీ వరకూ అంతర్రాష్ట్ర సరిహద్దులను కూడా షట్ డౌన్ చేసేశాయి. దాంతో అన్నీ రకాల రాకపోకలూ రెండు రాష్ట్రాల మధ్య ఆదివారం ఉదయం నుండి  నిలిచిపోయాయి.

 

విజయవాడ నుండి గుంటూరు జిల్లాలోకి ప్రవేశించే కనకదుర్గ వారధి, ప్రకాశం బ్యారేజి, ప్రకాశం జిల్లాలోని మార్టూరు దగ్గర జాతీయ రహదారి, ఒంగోలు-కత్తిపూడి జాతీయ రహదారి కూడా మూతపడిపోయింది. కాబట్టి ప్రకాశం, విజయవాడ వైపు నుండి గుంటూరు జిల్లాలోకి నో ఎంట్రీ. అలాగే  తెలంగాణాలోని నల్గొండ, మిర్యాలగూడ  జాతీయ రహదారులను కూడా తెలంగాణా ప్రభుత్వం మూసేయటంతో గుంటూరు జిల్లాలోకి ఎటువైపు నుండి కూడా ఎంట్రీ లేకుండా పోయింది. దాంతో అనధికారికంగా గుంటూరు జిల్లా కూడా లాకౌట్ జిల్లాల జాబితాలోకి వెళ్ళిపోయినట్లే.

 

దానికితోడు పై జిల్లాల్లోని చెక్ పోస్టులు దగ్గర పోలీసులను కూడా భారీ ఎత్తున కాపలా పెట్టిన కారణంగా ఏ వాహనం కూడా రాకపోకలు సాగించే అవకాశాలు లేదని తేలిపోయింది. నిత్యావసరాలను రవాణా చేస్తున్న వాహనాలు తప్ప ఇంక వేటినీ అనుమతించటం లేదు. దాంతో గుంటూరు జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. పైగా ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా ఇంకా ఎనిమిది రోజులు లాక్ డౌన్లోనే జిల్లా ఉండిపోతుంది. మొత్తానికి గుంటూరు జిల్లా పరిస్ధితి మాత్రం విచిత్రంగా తయారైంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: