సీఎం జగన్ కు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. ఏపీలో పంచాయతీ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడంపై సుప్రీం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగులు తొలగించాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. పంచాయతీ కార్యాలయాలకు వెంటనే రంగులు తొలగించాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కేంద్ర ప్రభుత్వ భవనాలకు కాషాయ రంగు వేస్తే ఏపీ ప్రభుత్వం ఒప్పుకుంటుందా..? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 
 
ఏపీ ప్రభుత్వం పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేయడంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం లో పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా ఆ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీం హైకోర్టు తీర్పును సమర్థించింది. ఏపీలో పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై గతంలో టీడీపీ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. 
 
అనంతరం కొందరు టీడీపీ మద్దతుదారులు వైసీపీ రంగులు వేయడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కొన్నిరోజుల క్రితం హైకోర్టు ఈ పిటిషన్ ను విచారించి పంచాయతీ కార్యాలయాల భవనాలకు రాజకీయ పార్టీల రంగులు తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. పది రోజుల్లో పార్టీ రంగులు తొలగించి కొత్త రంగులు వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2018 సెప్టెంబర్ 11న పంచాయతీ భవనాలకు రంగులు వేయాలంటూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చిన మెమోను హైకోర్టు రద్దు చేసింది. 
 
ప్రభుత్వ భవనాలకు, పార్టీ కార్యాలయాలకు రంగులు వేశారంటూ గుంటూరు జిల్లాకు చెందిన ముప్పా వెంకటేశ్వరరావు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. పార్టీ రంగులు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో సుప్రీం హైకోర్టు తీర్పును సమర్థిస్తూ రంగులు తొలగించాలని ఆదేశించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: