క‌రోనా వైర‌స్ దెబ్బ‌తో ఇప్ప‌టికే ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు కుదేలు అవుతున్నాయి. ఇక ఉత్ప‌త్తులు ఆగిపోవ‌డంతో పాటు డిమాండ్ పెర‌గ‌డంతో రేట్లు చుక్క‌ల్లో ఉంటున్నాయి. ఇక ఈ క్ర‌మంలోనే ఇండియా వ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్ర‌క‌టించాయి. ఇక లాక్ డౌన్ ప్ర‌క‌టించిన రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ, తెలంగాణ రెండూ ఉన్నాయి. క‌రోనా వ్యాప్తి నివారణ కోసం లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల మార్కెట్‌లో కూరగాయల ధరలు కొండెక్కాయి.



ఇక దీనికి తోడు ఆదివారం జ‌న‌తా క‌ర్ఫ్యూ అమ‌లు కావ‌డంతో అన్ని మార్కెట్లు మూసి వేశారు. ఇక ఇప్పుడు ఏకంగా ఈ నెల 31వ తేదీ వ‌ర‌కు ప్ర‌జా ర‌వాణా బంద్ అవ్వ‌డంతో పాటు ర‌క‌ర‌కాల నిషేధాలు అమ‌ల్లో ఉండ‌డంతో బ్లాక్ మార్కెట్లో వ్యాపారులు రెచ్చిపోతున్నారు. ఇదే అదనుగా సామాన్యులను కూరగాయల వ్యాపారులు నిలుపు దోపిడి చేస్తున్నారు. సోమ‌వారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌జ‌లు మార్కెట్ల‌లోకి వ‌చ్చి కూర‌గాయ‌లు కొంటుంటే వాళ్ల‌కు వ్యాపారులు చెపుతోన్న రేట్ల‌తో మండిపోతున్నాయి.



రెండు తెలుగు రాష్ట్రాల్లో ప‌లు చోట్ల రైతు బ‌జార్లు, సూప‌ర్ మార్కెట్లు, కూర‌గాయ‌ల మార్కెట్లు జనాలతో కిక్కిరిసిపోయాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు రు. 40 వ‌ర‌కు ఉన్న బీర‌, కేరెట్‌, బెండ‌, దొండ ఇప్పుడు ఏకంగా రు. 150కు చేరుకున్నాయి. ఇక మిర్చి మాత్ర‌మే కేజీ రు. 80కు అమ్ముతున్నారు. మిగిలిన కూర‌గాయ‌ల రేట్లు అన్ని మీడియం రేంజ్ న‌గ‌రాల్లో రు. 80 - 100 మ‌ధ్య‌లో ఉంటే ప్ర‌ధాన న‌గ‌రాలు పెద్ద పెద్ద ప‌ట్ట‌ణాల్లో అయితే ఏకంగా రు. 150కు చేరువ‌య్యాయి.



ఓ వైపు బ్లాక్ మార్కెట్లో తాము నిర్దారించిన రేట్ల కంటే ఎక్కువ రేట్ల‌కు అమ్మితే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పినా కూడా వ్యాపారులు మాత్రం ఆగ‌డం లేదు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని కొనుగోలుదారులు వాపోతున్నారు. మ‌రి ఇప్ప‌ట‌కీ అయినా రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు ఈ విష‌యంలో స‌రైన చ‌ర్య‌లు తీసుకుంటార‌ని.. ప్ర‌జ‌లు దోపిడీకి గురి కాకుండా చూస్తార‌ని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: