ప్రపంచాన్ని కరోనా వణికిస్తోంది. ఏకంగా వంద కోట్ల మందిని ఇళ్లకు పరిమితం చేసింది. ఇటలీలో మరణాల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. అమెరికా, యూరప్ లో లాక్ డౌన్లు అమల్లో ఉన్నాయి. చైనాలో కేసుల సంఖ్య నమోదు కాకపోయినా.. హాంకాంగ్ లో కేసులు కలకలం రేపుతున్నాయి. 

 

ప్రపంచ వ్యాప్తంగా 3 లక్షల 40 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 14వేల 573 మంది చనిపోయారు. 97 వేల వందికిపైగా కోలుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో వీకెండ్ ను భయం భయంగా గడిపారు. యువతకు కూడా కరోనా సోకవచ్చని, జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. వరుసగా మూడో రోజు కూడా చైనాలో ఎలాంటి కొత్త కేసులు నమోదు కాలేదు. అయితే చైనా పక్కనే ఉన్న హాంకాంగ్ లో కేసులు సంఖ్య పెరగడంతో.. చైనాకు మళ్లీ వైరస్ ఎటాక్ అవుతుందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. హాంకాంగ్, చైనాలో యూరప్ ట్రావెల్ హిస్టరీ ఉన్నవాళ్లు కరోనా వ్యాపింపజేసే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇటలీలో మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 59వేల మందికి కరోనా సోకగా, ఒక్కరోజే 5వేల 5వందలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే 651 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ కరోనా మరణాల్లో 36 శాతం ఇక్కడే నమోదవుతున్నాయి. అటు స్పెయిన్‌లోనూ మరణ మృదంగం కొనసాగుతోంది. ఒక్కరోజే ఇక్కడ 375 మంది చనిపోయారు. 

 

కరోనా దెబ్బకు ఐరోపా దేశాలు విలవిలలాడుతున్నాయి. ప్రజలు ఇంటికే పరిమితమవ్వాలని ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ సూచించాయి. జర్మనీ బావరియా ప్రాంతంలో లాక్ డౌన్ విధించారు. బ్రిటన్ లో కూడా కఠినమైన ఆంక్షలు అమలౌతున్నాయి. పబ్ లు, థియేటర్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. అమెరికాలో పరిస్థితి దారుణంగా ఉంది. అమెరికాలో ఇప్పటికే 32వేల మందికి వ్యాధి సోకింది. ఇందులో ఒక్కరోజే ఏకంగా 8వేలకు పైగా కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. న్యూయార్క్‌లో అత్యధిక కేసులు నమోదవుతుండగా.. తర్వాతి స్థానంలో వాషింగ్టన్ ఉంది. కాలిఫోర్నియా, న్యూజెర్సీలోనూ పరిస్థితి ఘోరంగా ఉంది. అమెరికాలో నాలుగువందలమందికిపైగా చనిపోగా.. ఒక్కరోజే వందమందికిపైగా మృత్యువాత పడ్డారు. అగ్రరాజ్యంగా పేరున్న అమెరికా కరోనాను కంట్రోల్ చేయలేక సతమతమవుతోంది. కరోనాను నియంత్రించలేకపోతున్న ట్రంప్.. చైనాను ఆడిపోసుకోవడానికే పరిమితమవుతున్నారు. 

 

ఆఫ్రికా, మధ్యప్రాచ్యంలో కూడా కరోనా వేగంగా విస్తరిస్తోంది. సిరియా, సోమాలియా వంటి దేశాలకు కూడా వ్యాధి వ్యాపించింది. ఇరాన్‌లో రోజుకు వెయ్యి కొత్త కేసులు వస్తున్నప్పటికీ, ప్రపంచ దేశాల మాదిరిగా కఠినమైన ఆంక్షలు విధించడం లేదు. కరోనా మహమ్మారిపై పోరాటంలో తప్పకుండా విజయం సాధిస్తామని మాత్రం చెబుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: