కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు ప్రపంచం అనేక ప్రయాత్నాలు చేస్తోంది. భారతదేశంలోని అనేక రాష్ట్రాలతో పాటు.. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. అయితే లాక్ డౌన్లపై బాంబు పేల్చింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. కరోనా తిరిగి పుంజుకోకుండా ఉండాలంటే ఆయా దేశాలు చేపట్టే ప్రజారోగ్య చర్యలు కీలకమంటూ ప్రకటించింది.

 

కరోనాపై భారత్ పెద్ద యుద్దమే చేస్తోంది. వైరస్ నియంత్రణ కోసం కేంద్రం దేశవ్యాప్తంగా 75 జిల్లాల్లో లాక్‌డౌన్ ప్రకటించింది. ఇవీగాక కొన్ని రాష్ట్రాలు సొంతంగా లాక్‌డౌన్ ప్రకటించాయి. అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, జార్ఖండ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలున్నాయి. లాక్‌డౌన్‌ల కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యే అవకాశం ఉండటంతో వైరస్ గొలుసును అడ్డుకోవచ్చునని.. తద్వారా వ్యాప్తిని నియంత్రించవచ్చునని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అయితే, వైరస్‌పై పోరాటానికి కేవలం లాక్ డౌన్‌లు మాత్రమే సరిపోవంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ  బాంబ్ పేల్చింది.

 

ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరు వైరస్ బారినపడ్డారో, అనారోగ్యం చెందారో వారిని గుర్తించడం.. ఐసోలేట్ చేయడం ప్రధానం. విదేశాల నుంచి వచ్చిన వారి ఆచూకీ కనిపెట్టి వీలైనంత త్వరగా వారిని ఐసోలేషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతే తప్ప వారిని గుర్తించకుండా.. ప్రజా ఆరోగ్యం పరంగా బలమైన చర్యలు చేపట్టకుండా కేవలం లాక్‌డౌన్‌లు ప్రకటించినా ఫలితముండదని WHO తెలిపింది. లాక్‌డౌన్‌లు ఎత్తివేసిన తర్వాత మహమ్మారి ఒక్కసారిగా మళ్లీ విజృంభించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు ఆ సంస్థ ప్రతినిధి మైక్ ర్యాన్.

 

ప్రతీ అనుమానితుడికి సరైన సమయంలో వైద్య పరీక్షలు నిర్వహించడానికి కఠిన చర్యలతో ఆంక్షలు విధించిన చైనా, సింగపూర్, దక్షిణ కొరియా ఉదాహరణలుగా యూరోప్‌కు ఒక నమూనాను అందించాయని తెలిపింది WHO. ఒకసారి వైరస్‌ను నియంత్రించిన తర్వాత.. అక్కడితో సరిపెట్టకుండా.. ఆ తర్వాత కూడా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు మైక్ ర్యాన్. వైరస్ నియంత్రణలోకి వచ్చిందని పోరాటాన్ని ఆపేయకూడదన్నారు.

 

వైరస్ నియంత్రణ కోసం ప్రస్తుతం చాలా వ్యాక్సిన్లు అభివృద్ది దశలో ఉన్నాయని, అయితే ఒక్క అమెరికాలోనే వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయని తెలిపింది WHO. బ్రిటన్‌లో వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి ఎంత సమయం పడుతుందనే ప్రశ్నకు సమాధానమిచ్చిన ఆయన.. ప్రజలు వాస్తవికంగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యాక్సిన్ కనుక్కొనే సమయానికి మనం మరింత విపత్తులోకి జారిపోకూదన్నారాయన. వ్యాక్సిన్ తయారీకి కనీసం సంవత్సరం సమయం పట్టవచ్చునని తెలిపారు.

 

ఏదేమైనా కేవలం లాక్‌ డౌన్‌లతో వైరస్‌ను ఎదుర్కోలేమని ర్యాన్ చెప్పడం భారత్‌కు ఒకరకంగా హెచ్చరిక లాంటిదేనని చెప్పాలి. అయితే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన దేశానికే కాదు.. ప్రపంచానికి సైతం లాక్‌డౌన్‌లు తప్ప వేరే మార్గం లేదనే విషయం మాత్రం వాస్తవం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: