ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 31 వరకు లాక్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. కొన్ని ప్రాంతాలలో ప్రజలు వ్యాపారులు, వాహనదారులు సీఎం ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఉండటంతో పోలీసులు లాక్ డౌన్ పై ఉక్కుపాదం మోపారు. అనవసరంగా రోడ్ల పైకి ఎవరైనా వస్తే ఎట్టి పరిస్థితుల్లోను ఉపేక్షించమని అన్నారు. 
 
పోలీసులు రాష్ట్రంలో రోడ్లపైకి వస్తున్న ప్రజలను నియంత్రించే పనిలో పడ్డారు.లౌడ్ స్పీకర్ల ద్వారా సీఎం ఆదేశాలను అందరూ పాటించాలని ప్రచారం చేస్తున్నారు. ప్రధాన కూడళ్లలో బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాల నియంత్రణ చేస్తున్నారు. ఈరోజు విజయవాడలో పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు మీడియాతో మాట్లాడారు. పోలీసులు కరోనా పాజిటివ్ కేసు నమోదైన కొత్తపేట ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారని అన్నారు. 
 
ఆ ప్రాంతానికీ మూడు కిలోమీటర్ల పరిధిలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. బ్యారేజీ మీదుగా గుంటూరు నుంచి వస్తున్న వాహనాలను సీతానగరం వద్ద నుంచి వెనక్కు పంపిస్తున్నట్లు చెప్పారు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటన చేశారు. నివాసానికి సమీపంలో ఉన్న దుకాణాలలో కిరాణా సరుకులు, కూరగాయలు కొనుక్కోవాలని సూచించారు. 
 
ఏపీలో ఇప్పటివరకూ ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలతో కరోనాను కట్టడి చేయడంలో సఫలమైంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో కరోనా ప్రభావం తక్కువగానే ఉంది. అధికారులు, ఆశా వర్కర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులు, గ్రామ వాలంటీర్లు ప్రజల్లో కరోనాపై అవగాహన పెంచడంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా నమోదవుతోంది.                              
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: