ప్రపంచానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు మన దేశంలో కూడా ప్రబలిపోతుంది.  తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ని అరికట్టేందుకు పకడ్భందీ చర్యలు తీసుకుంటున్నారు.  ఈ నేపథ్యంలో ఇప్పటికే లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే. అంతే కాదు లాక్ డౌన్ ఉల్లంఘనలకు పాల్పపడితే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.  ఇట‌లీ లాంటి ప‌రిస్థితి మ‌న‌కు రావొద్దంటే, వంద‌ల సంఖ్య‌లో మ‌ర‌ణాలు సంభ‌వించ‌వ‌ద్దంటే స్వీయ నియంత్ర‌ణ అవ‌స‌ర‌మ‌ని, ప్ర‌భుత్వం చెబుతున్న సూచ‌న‌ల‌ను క‌చ్చితంగా అమ‌లు చేయాల‌ని ఆదేశించారు.  అయితే ఇప్పటిదాకా కరోనా వైరస్ తో ఒక్కరు కూడా తెలంగాణలో చనిపోలేదని మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు.

 

ఒక్కరు కూడా వెంటిలేటర్ మీద లేరని ఇప్పటికే మొదటి కేసును డిశ్చార్జీ చేశామని, ఒకటి రెండు రోజుల్లో మరింత మందిని డిశ్చార్జీ చేస్తామని చెప్పారు.  ఈ నెల 31 వరకు రాష్ట్ర ప్రజలు ఎవరి ఇళ్లలో వారుండాలని తెలంగాణ ఆరోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. క్వారంటైన్ స్టాంప్ వేసిన వారు కూడా బయట తిరుగుతున్నారని.. వాళ్లను బయటకు వెళ్లనివ్వొద్దని తలిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ 10 రోజుల పాటు కమిట్‌మెంట్‌తో ఉంటే కరోనాను తరిమికొట్టవచ్చన్నారు.

 

నిత్యావసర దుకాణాలు తెరిచే ఉంటాయని.. ఇంటికి ఒక్కరు మాత్రమే బయటికి వెళ్లాలని ఆయన తెలిపారు. ఇక గాంధీ, కింగ్ కోఠీ, చెస్ట్, ఫీవర్ ఆస్పత్రుల్లో ఓపీ సేవలను నిలిపేశారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కరోనా చికిత్సకు తమ వంతు సయం చేయనున్నాయి.  రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి రెండో దశకు చేరుకోవడం వల్లే లాక్‌డౌన్ ప్రకటించి కఠిన నిబంధనలు అమలు చేస్తున్నామని ఈటల చెప్పారు.  నర్సింగ్‌, మెడికల్‌ విద్యార్థుల సేవలు తీసుకుంటామన్నారు. ఎయిమ్స్‌, ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లోనూ ఏర్పాట్లు చేశామని మంత్రి ఈటల మీడియాకు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: