ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య మూడున్నర లక్షలకు చేరింది. కరోనా భారీన పడి 15,000 మంది మృతి చెందారు. దేశంలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండగా మృతుల సంఖ్య 9కు చేరింది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని ముందుజాగ్రత్తచర్యలు చేపడుతున్నాయి. తెలంగాణలో ఒక్కరోజే ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 33కు చేరగా ఏపీలో ఇప్పటివరకూ 6 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఒకరి నుండి మరొకరికి సోకిన కేసులు మూడు నమోదు కావడం గమనార్హం. మరోవైపు కేరళలో ఒక్కరోజే అత్యధిక పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకేరోజు 28 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో బాధితుల సంఖ్య 92కు చేరింది. 
 
ఇటలీలో కరోనా వల్ల అత్యధిక సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి. చైనాలో 3,270, స్పెయిన్ లో 2,182, ఇరాన్ లో 1872, ఫ్రాన్స్ లో 674, అమెరికాలో 400, దక్షిణ కొరియాలో 110 మంది మృతి చెందారు.కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం దేశంలో కరోనా బాధితుల సంఖ్య 433కు చేరింది. ఇప్పటివరకూ వీరిలో 24 మంది కోలుకున్నట్లు తెలుస్తోంది. 
 
సీఎం కేసీఆర్ నిన్న ఈ నెల 31 వరకు లాక్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. తాజాగా లాక్ డౌన్ కు సంబంధించిన జీవో విడుదలయింది.తెలంగాణ ప్రభుత్వం 23 నిబంధనలను విధించగా ఏపీ ప్రభుత్వం బ్యాంకు వేళల్లో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో బ్యాంకులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పని చేయనున్నాయి. బ్యాంకర్ల సమితి కరోనా ప్రభావిత ప్రాంతాల్లో తాత్కాలికంగా బ్యాంకులు మూసివేయాలని నిర్ణయం తీసుకుంది.                  

మరింత సమాచారం తెలుసుకోండి: