తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ లో భాగంగా పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వం ఈరోజు లాక్ డౌన్ కు సంబంధించిన నిబంధనలను విడుదల చేసింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో కర్ఫ్యూ మొదలైంది. సాయంత్రం ఏడు గంటల నుంచి రాష్ట్రంలో కిరాణా షాపులతో సహా అన్ని దుకాణాలు బంద్ అయ్యాయి. ప్రభుత్వం ప్రజలు లాక్ డౌన్ రూల్స్ ను సరిగ్గా పాటించకపోవడంతో నిబంధనలను కఠినతరం చేసింది. 
 
రాష్ట్రంలో రాత్రి 7 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉండనుంది. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే వారికి ఏడాది జైలు శిక్ష విధించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో సెక్షన్ 188ను కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో ఈరోజు రాత్రి నుండే కర్ఫ్యూ కొనసాగుతోంది. ప్రధాని మోదీ పిలుపు మేరకు నిన్న జనతా కర్ఫ్యూకు స్వచ్చందంగా మద్దతు ఇచ్చిన ప్రజలు ఈరోజు మాత్రం రోడ్లపైకి గుంపులుగుంపులుగా వచ్చారు. 
 
పలు జిల్లాల్లో లాక్ డౌన్ నిబంధనలు సరిగ్గా అమలు కాలేదు. పోలీసులు ప్రజలను ఇళ్లకే పరిమితమవ్వాలని సూచించినా ప్రజలు ఆ మాటలను పట్టించుకోలేదు. ప్రజలు విజ్ఞప్తి చేసినా వినడం లేదని ప్రభుత్వానికి సమాచారం అందడంతో ప్రభుత్వం నిబంధనలలో మార్పులు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కరోనా నిరోధానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. 
 
ఈ నెల 31 వరకు ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేయడంతో రాష్ట్రంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఆస్పత్రులు, మెడికల్ షాపులకు మాత్రమే ప్రభుత్వం రాత్రి 7 గంటల తర్వాత అనుమతిచ్చింది. ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయనున్నారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రభుత్వం మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకోనుందని తెలుస్తోంది.      

మరింత సమాచారం తెలుసుకోండి: