రాష్ట్రంలో క‌రోనా ప్ర‌బ‌లుతున్న సంకేతాలు అందుతున్నాయ‌ని, దానికి అనుగుణంగా ప్ర‌జ‌ల‌కు స‌రైన వైద్యం అందేలా చూడాల‌ని కోరుతూ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి టీడీపీ అధినేత‌, ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు చంద్ర‌బాబు లేఖ రాశారు. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో రాష్ట్రంలో నెల‌కొన్న ప‌లు స‌మ‌స్య‌ల‌ను, తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు, వైద్య సదుపాయాలు, పేద ప్ర‌జ‌ల‌కు అందించాల్సి న నిత్యావ‌స‌ర వ‌స్తువులు, న‌గ‌దు సాయం వంటి అంశాల‌పై సుదీర్ఘంగా పేర్కొన్నారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ చేసినంత మాత్రనా క‌రోనా వ్యాప్తి కంట్రోల్ కాద‌ని కూడా లేఖ‌లో స్ప‌ష్టం చేశారు. ఓ వైపు జాగ్ర‌త్త‌లు తీసుకుంటూనే మ‌రోవైపు క‌రోనా రోగుల‌కు చికిత్స చేసేందుకు ప్ర‌త్యేకంగా ఆస్ప‌త్రి భ‌వ‌నాన్ని నిర్మించాల‌ని లేఖ‌లో విజ్ఞ‌ప్తి చేశారు. 

 

డ‌బ్ల్యూహెచ్‌వో సూచనల మేరకు మన రాష్ట్రంలో కూడా కరోనా వ్యాధి నిరోధక చర్యలు త్వరిత గతిన చేపట్టాలని చంద్రబాబు... జగన్‌కు సూచించారు.అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, పరిసరాలను శుభ్రం చేయాలని చంద్రబాబు కోరారు. లాక్‌డౌన్ అమ‌లుతో ల‌క్ష‌లాది  ప్ర‌జ‌ల ఉపాధిపై దెబ్బ ప‌డుతోంద‌ని అన్నారు. అందుకే వారికి ప్రతీ కుటుంబానికి వెంటనే రూ.5వేల నగదు సాయం అంద‌జేయాల‌న్నారు. అలాగే రెండు నెలలకు సరిపడా నిత్యావసరాలు అందచేయాలన్నారు. బియ్యం, పప్పులు,వంటనూనె, చక్కెర, కూరగాయలు, ఇతర నిత్యావసరాలు ప్రతి ఇంటికి డోర్‌ డెలివరీ చేయాలని లేఖ‌లో కోరారు. 

 

నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు రాష్ట్రంలో పెరిగిపోయాయ‌ని అన్నారు. అలాంటి వ్యాపారుల‌పై ప్ర‌భుత్వం వెంట‌నే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకునేలా  ఆదేశాలు జారీ చేయాల‌ని కోరారు. క‌రోనా నేప‌థ్యంలో లేఖ‌లో ప‌లు అంశాల‌పై సుధీర్ఘంగా చంద్ర‌బాబు నివేదించ‌గా దీనిపై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఏవిధంగా స్పందిస్తాడు అనేదానిపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో,ప్ర‌జానీకంలో ఆస‌క్తి నెల‌కొంది.  అస‌లు స్పందిస్తారా..? అనే అనుమానాలు వ్య‌క్తం చేసేవారు లేక‌పోలేదు లెండి. అయితే లేఖ‌లు రాయడం అన్న‌ది రాజ‌కీయాల్లో ఎప్ప‌టి నుంచో వ‌స్తోంది. అయితే చాలా కాలం త‌ర్వాత ముఖ్య‌మంత్రి లేఖ రాసి చంద్ర‌బాబు త‌న‌లోని పాత‌త‌రం ల‌క్ష‌ణాల‌ను బ‌య‌ట పెట్టుకున్నార‌ని కొంత‌మంది గుస‌గుస‌లాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: