ప్రధానమంత్రి నరేంద్రమోడి, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇద్దరినీ జగన్మోహన్ రెడ్డి ఒకేసారి ఇబ్బందుల్లోకి నెట్టేశాడు. రాజధాని ప్రాంతంలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సిబిఐ తో దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది.  వెంటనే సిబిఐని రంగంలోకి దింపాలని కోరుతూ కేంద్రానికి లేఖ కూడా రాసేసింది. అంటే ఇపుడు డిసైడ్ చేయాల్సింది కేంద్రప్రభుత్వమే. నిజానికి చంద్రబాబునాయుడుపై సిబిఐతో విచారణ జరిపించేందుకు ఇటు కేంద్రానికి చాలా అవకాశాలే ఉన్నాయి.

 

అయితే ఆ అవకాశాలన్నింటినీ వదిలేసుకుని రాష్ట్రప్రభుత్వం సిఫారసు చేస్తే తాము సిబిఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తామని ఇంతకాలం కేంద్రం తప్పించుకుంటోంది. పోలవరం ప్రాజెక్టులో అవినీతితో పాటు కేంద్ర పథకాల్లో జరిగిన అవినీతిపై కేంద్రమే తనంతట తానుగా సిబిఐతో విచారణ జరిపించవచ్చు. పోలవరాన్ని చంద్రబాబు ఏటిఎంలాగ వాడుకున్నాడని స్వయంగా ప్రధానమంత్రే ఆరోపించిన విషయం అందరికీ తెలిసిందే.

 

సరే నువ్వా నేనా అన్నట్లు సాగిన దాగుడుమూతలు ఇపుడు క్లైమ్యాక్స్ కు చేరుకుంది. ఇన్ సైడర్ ట్రేడింగ్ విషయంలో ప్రధాన ఆరోపణలన్నీ చంద్రబాబు చుట్టూనే తిరుగుతున్న విషయం తెలిసిందే. ఇదే విషయమై అధికారుల కమిటి, మంత్రివర్గం ఉపసంఘం, సిఐడి కూడా చంద్రబాబు అండ్ కో పాత్రపై అనేక ఆధారాలను సేకరించింది. చంద్రబాబు అండ్ కో సుమారు 4070 ఎకరాలను దోచేసుకున్నట్లు అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చి మరీ చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది.

 

ఇంతటి భారీ కుంభకోణంపై సిబిఐతో  విచారణ జరిపించమని రాష్ట్రప్రభుత్వం సిఫారసు చేసిన తర్వాత కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఎందుకంటే కేంద్రం నుండి తనకు ఎటువంటి సమస్యలు రాకుండానే సుజనా చౌదరి, సిఎం రమేష్ లాంటి వాళ్ళను ముందు జాగ్రత్తగా చంద్రబాబే బిజెపిలోకి పంపారు. దానికి తగ్గట్లుగా వాళ్ళు కూడా బిజెపిలో ఉంటూ చంద్రబాబు గొంతునే వినిపిస్తున్నారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ లో సుజనా కూడా ఉన్నట్లు బుగ్గన చెప్పారు. మరి ఈ పరిస్ధితుల్లో మోడి, అమిత్ షా ఏం చేస్తారో చూడాలి.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: