కరోనా విస్తృతి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రత్యేకించి యూరప్ దేశాల్లో దీన్ని అడ్డుకట్ట వేయడం చాలా కష్టంగా మారింది. ఇది పురుడు పోసుకున్న చైనాలో దీన్ని కట్టడి చేసినట్టే కనిపించింది. కమ్యూనిస్టు పాలన కావడం, దేశవ్యాప్తంగా ఉన్న వనరులను ఒక్క వుహాన్‌లోనే కేంద్రీకరించడం వంటి వ్యూహాలతో చైనా దీన్ని అదుపు చేసినా.. చైనా నుంచి ఈ వ్యాధి పొందిన యూరప్ లో మాత్రం పరిస్థితి భయానకంగా ఉంది.

 

 

ప్రత్యేకించి ఇటలీ సంగతి మరీ దారుణంగా ఉంది. అక్కడ రోజూ వందల సంఖ్యలో కరోనా చావులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా.. ఇవాళ ఒక్కరోజే.. 604 మంది మరణించినట్టు ఆ దేశం ధ్రువీకరించేసింది. దీంతో ఇటలీ లో కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య ఆరు వేలు దాటి పోయింది. ఒక్క దేశంలో రోజుల వ్యవధిలో ఆరు వేల మంది చనిపోవడం అంటే మాటలా.. అదీ ఈ కాలంలో.. తలచకుంటేనే ఒళ్లు జలధరిస్తోంది కదా. ఇంకా ఈ దేశంలో 70 వేల మందికి కరోనా సోకింది. వారు చికిత్స పొందుతున్నారు.

 

 

ఇక మరో యూరప్ దేశం స్పెయిన్ లోనూ పరిస్థితి ఇంత భయంకరంగా లేకపోయినా.. అక్కడా దారుణంగానే ఉంది. స్పెయిల్ లో ఇవాళ ఒక్కరోజే.. 434 మంది వరకూ చనిపోయినట్టు అధికారికంగా ధ్రువీకరించారు. ఇవాళ ఒక్కరోజే దాదాపు 4300 కొత్త కేసులు ఈ దేశంలో నమోదయ్యాయి. అంటే ఎంత వేగంగా విస్తరిస్తోందో చూడండి. ఈ దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 33 వేలకు చేరుకుంది. ఈ దేశంలో మొత్తం ఇప్పటి వరకూ 2వేల మందికి పైగా కరోనా కారణంగా చనిపోయారు.

 

 

ఈ రెండు దేశాల్లోనే దాదాపు వెయ్యి మంది ఒక్క రోజులో చనిపోయారంటే కరోనా మహమ్మారి ఎంత కర్కశంగా విజృంభిస్తుందో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ మహమ్మారిని ఎలా అరికడతారో.. ఎలా దారికి తెస్తారో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: