కరోనా కట్టడి గురించి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్ డౌన్ పెట్టినా జనం పెద్దగా పట్టించుకోవడం లేదు. జనతా కర్ఫ్యూ ఒక్క రోజు బాగానే స్పందించినా.. సోమవారం మాత్రం జనం జోరుగా రోడ్లపైకి వచ్చారు. సెలవు ఇచ్చేసి ఇంట్లో ఉండండ్రా నాయనా అంటే కూడా వినే పరిస్థితి లేదు. తెల్ల రేషన్ కార్డుకు 1500 రూపాయలు, రేషన్ సరుకులు ఇస్తామని చెప్పినా.. జనం మాత్రం పట్టించుకోలేదు.

 

 

చివరకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. అయితే వీరికి వ్యాధి సీరియస్ నెస్ తెలియకపోవడమే ఇందుకు కారణంగా తోస్తోంది. కానీ అసలు విషయం ఏంటంటే.. కరోనా వైరస్ వచ్చిన వారిలో 1 నుంచి 2% మంది చనిపోతారు. అంటే వంద లో 98-99 మంది దీని నుండి కోలుకుంటారు. అయితే వందలో పది నుండి ఇరవై మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యి హాస్పిటల్ లో చేరవలసిన అవసరం పడుతుంది. 60 ఏళ్ళకు పైబడిన వృద్ధులు, గుండె జబ్బులు, షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళకు కరోనా వైరస్ సోకితే తీవ్ర అస్వస్థతకు గురయ్యి చనిపోయే అవకాశాలు ఎక్కువ.

 

 

80 % మంది స్వల్ప అస్వస్థత మాత్రమే కలిగిన ప్రజలు మామూలుగా తిరుగుతూ వృద్ధులకు, ఇతర వ్యాధులున్న వారికి వ్యాప్తి చేసి వారి మరణాలకు కారణమవుతారు. ఇది వ్యాపించి ప్రపంచంలో 50-65% ప్రజలు కరోనా బారిన పడే అవకాశం ఉంది. ఉదాహరణకు సుమారు నాలుగు కోట్ల మంది జనాభా ఉన్న తెలంగాణాలో వ్యాధిని అరికట్టే చర్యలు తీసుకోకపోతే రెండు నుండి రెండున్నర కోట్ల మందికి కరోనా సోకే అవకాశం ఉంది. తక్కువలో తక్కువ 1% అనుకున్నా రెండు నుండి రెండున్నర లక్షల మంది చనిపోయే ప్రమాదం పొంచి ఉంది.

 

అదే ఏపీలో ఆరు కోట్ల జనాభా ఉన్నారు. ఇందులో 60 శాతం మందికి ఈ వ్యాధి వ్యాపించే అవకాశం ఉంది. పోనీ 50 శాతం అనుకున్నా.. మూడు కోట్ల మందికి వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఒక్క శాతం అనుకుంటే.. 3 లక్షల మంది అన్నమాట. మరి ఎందుకు ఇంత రిస్క్ తీసుకోవడం.. దాని వ్యాప్తిని ఇంట్లోనే ఉండి అరికట్టొచ్చుకదా.

మరింత సమాచారం తెలుసుకోండి: