తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ వేగంగా పెరుగుతోంది. ఒక్క రోజులోనే ఆరు కొత్త కేసులు నమోదయ్యాయి. దీనికి తోడు జనం లాక్ డౌన్ ప్రకటించినా కుప్పలు తెప్పలుగా రోడ్లపైకి వచ్చారు. దీంతో తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. పనులు కావాలా.. ప్రాణాలు కావాలో తేల్చుకోమని చెప్పారు.

 

 

ఇదే సమయంలో విదేశాల నుంచి వచ్చి హోం క్వారంటైన్‌లో ఉండి బయటకు వస్తున్న వాళ్లపై నిప్పులు చెరిగారు. వాళ్లు 14 రోజుల పాటు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. అలాంటి వారు స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. వాళ్ల కుటుంబసభ్యులు కూడా వాళ్లని బయటకు వెళ్లకుండా చేయాలని గట్టిగా చెప్పారు.

 

 

క్వారంటైన్‌లో ఉన్న వాళ్లను 14 రోజుల తర్వాత పరీక్షలు చేసి ఇంటికి పంపిస్తామని ఈటల వివరించారు. హోం క్వారంటైన్‌లో ఉన్నవాళ్లు మాత్రం బయట తిరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. అవసరమైతే వారిపై కేసులు తప్పవని మంత్రి వార్నింగ్ ఇచ్చారు. వాళ్ల మొబైల్‌ ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా ట్రాక్‌ చేసి వాళ్లను పట్టుకుంటామని చెప్పారు.

 

 

ఇవాళ తెలంగాణ కరోనా విషయంలో స్టేజ్‌-2లో ఉన్నామని.. స్టేజ్‌-3 పరిస్థితి రానీయొద్దని మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. ఈనెల 31 వరకు అందరూ ఇళ్లకే పరిమితం కావాలని ప్రజలకు ఈటల సూచించారు. ఈ పది రోజులు చాలా కీలక సమయమన్న రాజేందర్... ఓపికతో ఉంటే దీన్ని తరిమికొట్టే అవకాశం ఉంటుందని చెప్పారు. జనతా కర్ఫ్యూలో చూపిన స్ఫూర్తిని జనం ప్రస్తుతం చూపించడంలేదని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ ప్రకటిస్తే.. కొందరు మాత్రం ఏదో కొంపలు మునిగిపోతున్నట్టుగా బయటకు వస్తున్నారని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: