ఏపీ సీఎం జగన్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేయనున్న నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పథకం గురించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవోలో పేదలు తప్పనిసరిగా ఇళ్లు కట్టుకోవాలనే నిబంధన ఎందుకు లేదని కోర్టు ప్రశ్నించింది. లబ్ధిదారుల పేరు మీద ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్ చేసేందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను కోర్టు నిలిపివేసింది. 
 
ప్రభుత్వం లబ్ధిదారులకు కేటాయించిన స్థలాన్ని ఐదేళ్ల తర్వాత అమ్ముకోవడానికి వీలు కల్పించడాన్ని కోర్టు తప్పుబట్టింది. రాజధాని భూముల్లో కృష్ణా, గుంటూరు జిల్లాల పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా కోర్టు తప్పుబట్టింది. సంబంధిత జీవో అమలును కోర్టు సస్పెండ్ చేసింది. నిన్న త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. 
 
ఏపీ ప్రభుత్వం ఫిబ్రవరి 25న రైతుల నుంచి రాజధాని అమరావతి నిర్మాణం కొరకు సేకరించిన భూమిని గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల, మంగళగిరి, పెదకాకాని, తాడేపల్లి మండలాలలోని లబ్ధిదారులు, విజయవాడ నగరపాలకసంస్థ పరిధిలోని లబ్ధిదారులకు కేటాయిస్తూ జీవో జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ నందకిశోర్ అనే వ్యక్తి పిల్ దాఖలు చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలను కోర్టు సస్పెండ్ చేయడంతో పథకం అమలు కావడం కష్టమే అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
రాజధాని కోసం రైతులకు ఇచ్చిన భూములను ఇళ్ల స్థలాలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం సీఆర్డీఏ నిబంధనలకు వ్యతిరేకమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని పరిధిలో భూములిచ్చే విషయంలో పాత్ర ఉండదని స్పష్టం చేసింది. సీఆర్డీఏ అథారిటీ, అదనపు కమిషనర్ కు మాత్రమే ఆ హక్కులు ఉంటాయని.... ప్రభుత్వం నిబంధనల ప్రకారం భూసేకరణ చేసి పేదలకు భూములు ఇవ్వొచ్చని కోర్టు తెలిపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: