తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్  ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజలందరూ ఇంటికే పరిమితం కావాలంటూ  సూచించింది. మార్చి 31 వరకూ ప్రజలెవరూ ఇంటి నుండి కాలు బయట పెట్టకూడదు అని తెలిపింది . పరిస్థితిని అర్థం చేసుకోవాలని సూచించింది. అయినప్పటికీ ప్రజలు మాత్రం ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ విధించినప్పటికీ యథేచ్ఛగా రోడ్లపైనే తిరుగుతున్నారు. రవాణా వ్యవస్థ మొత్తం ఎక్కడికక్కడ ఆగిపోవడంతో సొంత వాహనాలతో రోడ్లపైకి చేరుతున్నారు. ఇక ఇష్టారీతిన రోడ్ల పైకి వస్తున్న వాహనదారులకు ఇంటికి వెళ్లాలని కరోనా  వైరస్ కట్టడి సహకరించాలని  పోలీసులు ఎంత చెప్పినా వినక పోవడంతో కొరడా ఝుళిపించారు. 

 

 

 ప్రభుత్వ ఆదేశాలను లెక్కచేయకుండా రోడ్డు మీదికి వస్తూ  ఇష్టారీతిన వ్యవహరిస్తున్న వాహనదారులపై కఠినంగానే వ్యవహరించారు. హైదరాబాద్ నగరంలో తొలిరోజే మార్చి 23వ తేదీన 2480 వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు పోలీసులు. సోమవారం మధ్యాహ్నం నుంచి నగరంలోని అన్ని మార్గాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. నగరంలోని 25 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏకంగా 73 చెక్ పోస్ట్ లను  ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రోడ్డుమీదికి వచ్చిన వాహనదారులపై కొరడా జరిపించి.. ఏకంగా 2480 వాహనాలను సీజ్ చేసినట్లు ట్రాఫిక్ విభాగం అదనపు పోలీసు కమిషనర్ వెల్లడించారు. 

 

 

 ఇలా తాము సీజ్ చేసిన వాహనాలలో ఒక 1058 బైకులు ఉండగా,  948 ఆటోలు,  429 కార్లు ఇతర 4 వీలర్ లు,  45 ఇతర వాహనాలు ఉన్నట్లు వెల్లడించారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఏ వాహనం కూడా బయట తిరగకూడదు అంటూ పోలీసులు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్లు గానే రాష్ట్ర ప్రజలందరూ కరోనా  వైరస్ ను కట్టడి చేసేందుకు సహకరించాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఏ ఒక్క వాహనం కూడా రోడ్ల మీదికి రాకూడదు అంటూ సూచించారు. అయితే కరోనా  వైరస్ ను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్  విధించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను కొట్టిపారేస్తూ యథేచ్ఛగా రోడ్లపైకి వచ్చి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రజలపై కఠిన చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: