ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య మూడున్నర లక్షలకు చేరింది. కరోనా మృతుల సంఖ్య 15,000 దాటింది. ప్రతిరోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో నిన్న ఒక్కరోజే 6 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో బాధితుల సంఖ్య 33కు చేరింది. ఏపీలో నిన్న కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో బాధితుల సంఖ్య 7కు చేరింది. నిన్న విశాఖ జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. 
 
ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన యువకుడు ఈ నెల 17న విశాఖ వచ్చాడు. యువకునిలో కరోనా లక్షణాలు కనిపించడంతో ఆస్పత్రిలో చేర్చి నమూనాలను పరీక్షల కోసం పంపించగా రిపోర్టులో పాజిటివ్ అని తేలింది. రాష్ట్రంలో 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా విశాఖలోనే మూడు కేసులు నమోదు కావడం గమనార్హం. నిన్న రాత్రి ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ఈ విషయాలను వెల్లడించింది. 
 
ప్రభుత్వం రాష్ట్రంలోకి విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు 14 రోజులు ఇంట్లోనే ఉండాలని సూచించింది. ప్రభుత్వ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ అయ్యాయి. అధికారులు ఎవరైనా కరోనా అనుమానిత లక్షణాలతో కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని సూచించారు. రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసుగా నమోదైన యువకుడు డిశ్చార్జ్ అయ్యాడు. 
 
ఇటలీ నుంచి నెల్లూరుకు వచ్చిన వ్యక్తిలో కరోనా లక్షణాలు కనిపించడంతో నమూనాలు సేకరించి ల్యాబ్ టెస్టులు చేయించారు. మొదట కరోనా పాజిటివ్ రాగా తాజాగా చేసిన టెస్టుల్లో నెగిటివ్ రావడంతో నిన్న డిశ్చార్జి చేసి ఇంటికి పంపించారు. వైద్యులు 14 రోజుల పాటు హోం ఐసోలేషన్ పాటించాలని యువకునికి సూచించారు. ప్రభుత్వమే మెరుగైన చికిత్స అందించి ప్రాణాలు కాపాడిందని యువకుడు వీడియో విడుదల చేశాడు.      

మరింత సమాచారం తెలుసుకోండి: