ప్రపంచంలోని దేశాలన్నింటినీ గజగజా వణికిస్తున్న కరోనా వైరస్ భారత్ లో వేగంగా విజృంభిస్తోంది. నిన్న ఒక్కరోజే దేశంలో 99 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీ తెలంగాణలో బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తెలంగాణలో నిన్న ఒక్కరోజే ఆరు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో బాధితుల సంఖ్య 33కు చేరింది. ఏపీలో నిన్న మరో పాజిటివ్ కేసు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది. దీంతో ఏపీలో బాధితుల సంఖ్య 7కు చేరింది. 
 
సీఎం కేసీఆర్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆస్పత్రులు, మెడికల్ షాపులు మినహా ఇతర దుకాణాలు తెరవడానికి అనుమతి లేదని ఆదేశాలు ఇచ్చారు. బైక్ పై ఒకరు, కారులో ఇద్దరు మాత్రమే ప్రయాణించాలని సూచించారు. రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. 
 
ఏపీలో 181 మంది వైరస్ లక్షణాలున్న అనుమానితుల నమూనాలను ల్యాబ్ కు పంపగా వారిలో ఏడుగురికి పాజిటివ్ అని తేలింది. 166 మందికి కరోనా నెగిటివ్ అని నివేదిక రాగా 8 కేసులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. రాష్ట్రంలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని మంత్రి పేర్ని నాని ప్రకటించారు. రాష్ట్రంలో తొలి కరోనా పాజిటివ్ కేసుగా నమోదైన యువకుడు నిన్న డిశ్చార్జి అయ్యాడు. 
 
వైద్యులు వైద్యం కొనసాగిస్తూ నమూనాలను ల్యాబ్ కు పంపగా నెగిటివ్ రిపోర్టు రావడంతో నిన్న డిశ్చార్జి చేశారు. మరో 14 రోజుల పాటు హోం ఐసోలేషన్ పాటించాలని యువకునికి వైద్యులు సూచించారు. కరోనా కట్టడికి సంబంధించిన సలహాలు, సూచనల కోసం పురపాలక శాఖ 180059924365 టోల్ ఫ్రీ నంబర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇండుకోసం ప్రభుత్వం ప్రత్యేకమైన కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: