కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. అందుకే ప్రభుత్వాలు కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ఒక్క నెల్లూరు జిల్లాలోనే 880 మంది హోం క్వారంటైన్‌ లో ఉన్నారన్న విషయం ఆసక్తి రేపుతోంది. జిల్లా సరిహద్దులు మూసేశారు.. జిల్లాలోకి ఇతర ప్రాంతాల నుంచి ఎవరూ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 

 

అసలు ఏపీలో మొదటి పాజిటివ్ కేసు నమోదైన జిల్లా ఈ నెల్లూరు జిల్లాయే.. అయితే ఇప్పుడు సీరియస్ చర్యలు తీసుకోకపోతే వ్యాప్తి నివారణ కష్టమన్న బావన నెలకొంది. అందుకే పరిస్ధితిని ఎప్పటికప్పుడు కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబు సమీక్షిస్తున్నారు. తడలోని టూరిజం హోటల్‌ను కరోనా క్వారంటైన్‌గా మార్చేశారు. గతంలో కరోనా పాజిటివ్‌ వ్యక్తికి ఇప్పుడు నెగిటివ్‌గా నిర్ధారణ కావడంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.

 

 

జిల్లాలో అనుమానితులను వెంటనే చెక్‌చేసేందుకు ర్యాపిడ్‌ మెడికల్‌ టీం సిద్దం చేశారు. ప్రైవేట్‌ కంపెనీలలో పనిచేస్తున్న సిబ్బందిని కూడా ధర్మల్‌స్కాన్‌ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. ఇక మరో కరోనా పాజిటివ్ వచ్చిన ప్రకాశం జిల్లాలో పరిస్ధితి కాస్త పరవాలేదు. ఇక్కడ కరోనా పాజిటివ్‌ యువకుడి ఆరోగ్యం నిలకడగా ఉంది.

 

 

ఒంగోలు పాజిటివ్‌ కేసు యువకుడి తల్లి, తండ్రి, చెల్లికి నెగిటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. ఒంగోలు ప్రభుత్వ జనరల్ వైద్యశాల క్వారంటైన్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ పరీక్షలు చేసిన వారందరికీ నెగిటివ్‌ రిపోర్ట్‌లు రావడం కాస్త ఊరట కలిగిస్తోంది. కలెక్టర్‌ పోల భాస్కర్‌ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తున్నారు. కింది స్ధాయి సిబ్బంది పూర్తిస్ధాయిలో అప్రమత్తతతో ఉన్నారని వైద్య అధికారులు చెబుతున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: