ఓ వైపు కరోనాని చూసి ప్రపంచం భయపడుతుటే.. ఇదే అదనుగా వాట్సప్ వర్సిటీలో మెసేజ్ లు, పోస్టింగులు దుమ్మురేపుతున్నాయి. తెలిసీ తెలియని విజ్ఞానమంతా ప్రదర్శిస్తున్న నెటిజన్లు.. తమకు తోచిన సలహాలు వాట్సప్ చేస్తూ.. జనాన్ని మరింత కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తున్నారు. కరోనాకు వ్యాక్సిన్ వచ్చేసిందని, జనతా కర్ఫ్యూ అసలు ఉద్దేశం ఇదే అంటూ కొన్ని మెసేజ్ లు వైరల్ అయిన తీరు చూస్తే.. నెటిజన్ల ఓవరాక్షన్ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతోంది. 

 

తెలిసిన వాడికి చెప్పగలం. తెలియనివాడికి చెప్పగలం. కానీ తెలిసీ తెలియనివాడికి చెప్పలేమనేది సామెత. కరోనాపై వాట్సప్ లో వస్తున్న పోస్టులు చూస్తే ఇది నిజమేననిపిస్తోంది. కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేసిందని, ఇది తీసుకున్న మూడు గంటల్లో కరోనా పోతుందని వాట్సప్ లో మెసేజ్ వైరల్ అయింది. పైగా రోచ్ కంపెనీకి వాక్సిన్లు తయారుచేయడానికి ట్రంప్ అనుమతి ఇచ్చేశారని కూడా ప్రచారం జరిగింది. ఏకంగా ఓ వీడియో కూడా వైరల్ చేశారు. అయితే ఇది ఫేకని తేలింది. చాలామందికి ఈ విషయం తెలియక.. వాట్సప్ కు వ్యాక్సిన్ వచ్చేసిందని నమ్మారు. 

 

సహజంగా బాగా చదువుకున్నవాళ్లే ఎక్కువగా వాట్సప్ వాడతారు. ఎంతో కొంత ఇంగిత జ్ఞానం ఉందనుకునే వీళ్లు కూడా కరోనాకు సంబంధించిన ఎన్నో ఫేక్ న్యూస్ విస్తృతంగా వైరల్ చేశారు. రష్యాలో సింహాలను రోడ్లపైకి వదిలారని, భారత్ లో కరోనా తగ్గిపోయిందని నాసా చెప్పిందని, ప్రభుత్వం హెలికాప్టర్ల ద్వారా వైరస్ నిరోధక ద్రావణాన్ని పిచికారీ చేస్తుందని, మోడీ 400 రూపాయల ఫ్రీ టాక్ టైమ్ ప్రకటించారనే ఫేక్ న్యూస్ విపరీతంగా వైరల్ అయ్యాయి. అయితే ఇవన్నీ అవాస్తవమేనని తేలింది. 

 

దేశంలో కరోనా కారణంగా పేరుకుపోతున్న శవాల గుట్టల్ని చూసి ఇటలీ అధ్యక్షుడు కన్నీరు పెట్టుకున్నారని కూడా ఫేక్  మెసేజ్ వైరల్ చేశారు. అయితే అసలు ఆయన ఇటలీ అధ్యక్షుడు కాదు.. బ్రెజిల్ అధ్యక్షుడని అసలు విషయం బయటికొచ్చింది. ఇక జనతా కర్ఫ్యూ గురించి బయటికొచ్చిన ఫేక్ న్యూస్ కు అయితే లెక్కలేదు. వైరస్ బహిరంగ ప్రదేశాల్లో 12 గంటలు మాత్రమే బతుకుతుందని, అందుకే మోడీ 14 గంటల జనతా కర్ఫ్యూ ప్రతిపాదించారని మెసేజులు వెల్లువెత్తాయి. 

 

వైరస్ నిరోధక ద్రావణాలేవీ పిచికారీ చేయకపోయినా.. 12 గంటల తర్వాత వైరస్ బతకదని కూడా వాట్సప్ ప్రొఫెసర్లు ధీమాగా చెప్పారు. కానీ ఇవేమీ వాస్తవాలు కాదని ఎప్పటికప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు ప్రభుత్వాలు కూడా ఖండిస్తూనే వచ్చాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: