కరోనా ఓవైపు విజృంభిస్తున్నా ప్రజలకు దాని తీవ్రత అర్థం కావడం లేదు. ప్రభుత్వాలు మొత్తుకుంటున్నా జనం మాత్రం కొన్ని చోట్ల చాలా లైట్ గా తీసుకుంటున్నారు. అలాగే వద్దు మొర్రో అంటూ విందు భోజనం ఏర్పాటు చేసిన ఓ వ్యక్తిని పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. కరోనా పట్ల జనంలో అవగాహన లేమిని ఈ ఘటన అద్ధం పడుతోంది.

 

 

వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం మండలం అక్కంపేటలో ఆకుల సుధాకర్‌ అనే వ్యక్తి ఇటీవల తన తమ్ముడికి వివాహం జరిపించారు. ఆ తర్వాత తన ఇంట్లో సోమవారం పెద్దఎత్తున విందు భోజనం ఏర్పాట్లు చేశాడు. అయితే ఇంతలో కరోనా విజృంభణపై ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించాయి. ఆది వారం జనతా కర్ఫ్యూ కూడా నిర్వహించారు. దీంతో సోమవారం విందు రద్దు చేసుకోవాల్సిందిగా అధికారులు విజ్ఞప్తి చేశారు.

 

 

కరోనా ప్రభావం వల్ల ఐదుగురికి మాత్రమే భోజనాలు ఏర్పాటు చేసుకోవాలని, అంతకు మించి ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ నెల 22పంచాయతీ కార్యదర్శి ఆకుల సుధాకర్ కు నోటీసులు కూడా ఇచ్చాడు. కానీ సదరు ఆకుల సుధాకర్ ఈ విషయాన్ని లైట్ గా తీసుకున్నాడు. లాక్‌డౌన్‌ గీక్ డౌన్ జాంతానై అంటూ నిబంధనలను ఉల్లంఘించి విందు భోజనాలు ఏర్పాటు చేశాడు.

 

 

దీంతో అధికారులు చర్యలు చేపట్టారు. సదరు ఆకుల సుధాకర్‌ను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు. ప్రభుత్వ నిషేధ ఉత్తర్వులు, 144 సెక్షన్‌ అమలులో ఉన్నందున ఎటువంటి ఫంక్షన్లు, ఉత్సవాలు, జాతరలు నిర్వహించినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతూనే ఉన్నారు. కానీ ప్రజల బుర్రల్లోకి మాత్రం ఈ విషయం ఇంకా బలంగా వెళ్లడం లేదు. కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలంటే.. సామాజిక దూరం పాటించడం ఒక్కటే సరైన మార్గం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: