ప్రపంచం మొత్తం కరోనా  కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఎన్ని కఠిన నిబంధనలు అమలు చేసినా... రోజురోజుకు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం మాత్రం పెరిగిపోతూనే ఉంది. దీంతో ప్రజల్లో  తీవ్ర భయాందోళన నెలకొంటుంది. ఇక ఈ వైరస్ ను  వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ప్రపంచ మహమ్మారిగా గుర్తించడంతో ప్రజలు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఈ వైరస్ కు  సరైన వ్యాక్సిన్  లేకపోవడం నివారణ ఒక్కటే మార్గం కావడంతో ప్రాణభయంతో వణికిపోతున్నారు ప్రజలు. ఇలా రోజురోజుకు కరోనా వైరస్ బారినపడి మృత్యువుతో పోరాడుతున్న వారి సంఖ్య పెరగడంతో పాటు.. ఈ మహమ్మారి వైరస్ తో పోరాడలేక మృత్యువు ఒడి లోకి చేరుతున్న వారి సంఖ్య కూడా పెరిగిపోతుంది. 

 

 

 అయితే కరోనా వైరస్ ను నివారించేందుకు వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరమని వైద్యులు సూచిస్తున్న విషయం తెలిసిందే. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం తో పాటు వ్యక్తిగతంగా కూడా ఎంతో పరిశుభ్రత  పాటించి చేతులు కడుక్కోవడం ద్వారా కరోనా  వైరస్ వ్యాపించదు అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ బయట ఉన్న ప్రజలనే కాదు జైలు శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలకు కూడా ప్రాణభయంతో వణికిస్తోంది. ముఖ్యంగా జైళ్లలో ఉండే అపరిశుభ్ర వాతావరణం కారణంగా కరోనా  వైరస్ సోకే అవకాశం ఎక్కువగా ఉందని... అందుకే తాము ఇక్కడ ఉండలేము అంటూ జైలు ఖైదీలు చెబుతున్నారు. కొలంబియా రాజధాని బోగట జైలులో.. ఖైదీల్లో కరోనా వైరస్ భయం పట్టుకున్న నేపథ్యంలో... ఏకంగా తిరుగుబాటుకు కూడా సిద్ధపడ్డారు. 

 

 

 ఏకంగా భారీ సంఖ్యలో ఖైదీలు జైలు నుంచి పారిపోయేందుకు ప్రయత్నించి విధ్వంసం సృష్టించారు ఖైదీలు. పారిపోయేందుకు ప్రయత్నించిన ఖైదీలను అక్కడి పోలీసు అధికారులు పట్టుకునేందుకు ప్రయత్నించడంతో జైలులో పెద్ద యుద్దవాతావరణం నెలకొంది అని చెప్పాలి. ఇక చేసేదేమీ లేక కాల్పులు కూడా జరిపాల్సిన  పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో 23 మంది ఖైదీలు ప్రాణాలు కోల్పోగా మరో 83 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఏకంగా ఖైదీలతో పాటు జైలు సిబ్బంది కూడా ఉండటం గమనార్హం. దీనిపై దేశ న్యాయ శాఖ మంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జైలు లో ఏ ఒక్కరికి ప్రాణాంతకమైన కరోనా వైరస్... సోక లేదు అంటూ స్పష్టం చేసిన ఆయన అపరిశుభ్ర వాతావరణం ఉండడం వల్లా కరోనా వైరస్ వస్తుంది అనే వార్తల్లో నిజం లేదు అంటూ స్పష్టం చేశారు. జైల్లో జరుగుతున్న అల్లర్ల వెనుక కుట్ర దాగి ఉంది అంటూ అనుమానం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: