అగ్రరాజ్యానికి కష్టకాలమొచ్చింది. అమెరికన్ లకు ఛాలెంజ్‌ మొదలయింది. కరోనా వైరస్‌ ధాటికి అమెరికా అల్లకల్లోలమవుతోంది. ఊహించనంత  వేగంగా కరోనా అన్ని రాష్ట్రాలకు వ్యాపించటంతో అమెరికన్లు ఒక్కసారిగా సంక్షోభంలో పడ్డారు. ఏం జరగనుందా అనే ఆందోళనలో మునిగిపోయారు. వరుసగా రాష్ట్రాలన్నీ లాక్‌ డౌన్‌ ప్రకటిస్తున్నాయి. ఎక్కడికక్కడ అమెరికా స్తంభిస్తోంది. కరోనాపై వార్‌ కు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. 

 

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ అమెరికాను కూడా గడగడలాడిస్తోంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కర్ఫ్యూ వాతావరణం ఏర్పడింది. చైనా ఇటలీ తర్వాత అమెరికాలోనే ఎక్కువ కేసులున్నాయి. ఒక్కరోజులో వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 

 

రెండు రోజుల్లో సీన్ మారింది. గత వారం మొదట్లో పెద్దగా లేని కేసులు... వారాంతానికి వచ్చేసరికి అనూహ్యంగా పెరిగి, కేసుల సంఖ్యలో అమెరికా మూడోస్థానానికి చేరింది. ఇప్పటి వరకు 36 వేల మందికి వైరస్ సోకితే, ఎక్కువ కేసులు న్యూయార్క్‌ లోనే నమోదయ్యాయి. మార్చి 16 దాకా కేసుల వ్యాప్తి కాస్త మెల్లగా ఉన్నా, గత  నాలుగైదు రోజుల్లోనే విపరీతంగా పెరిగిపోయాయి.  ఒక్క రోజులోనే మూడు నాలుగు స్థానాల మధ్య స్పెయిన్‌ తో పోటీ పడుతూ... చివరికి మూడో స్థానంలో సెటిల్ అయింది అమెరికా. దీంతో కరోనా పరిస్థితుల నేపథ్యంలో దేశమంతా లాక్‌ డౌన్‌  దిశగా సాగుతోంది. దాదాపు అన్ని రాష్ట్రాలు పూర్తిగా మూతపడుతూ... పౌరులను ఇళ్లకే పరిమితమయ్యేలా చేస్తున్నారు.

 

ఒక్కమాటలో చెప్పాలంటే కరోనావైరస్ తో అమెరికా ఎన్నడూ లేనంతగా భయపడుతోంది. వైరస్ వేగంగా వ్యాప్తి చెందడంతో, అమెరికన్లు కూడా తీవ్రంగా భయపడుతున్నారు. ఆయుధాలకే నంబర్ వన్ కానీ, వైరస్ పై యుద్ధంలో కాదని గ్రహించిన అమెరికా ఇప్పుడు మరింత వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకునే దశలో ఉంది. నిజానికి కొద్ది రోజుల క్రితం ఇదో రాజకీయ కట్టుకథ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కరోనాను లైట్ తీసుకుంటూ కామెంట్ చేశారు. కానీ,ఇప్పుడదే వైరస్ ను  ఎదుర్కొనేందుకు అమెరికా కూడా నానా తంటాలు పడుతోంది.

 

అత్యున్నత నాగరికతకు, సామాజిక భద్రతకు నిలయమైన దేశంగా ప్రపంచం భావిస్తుంది. అందుకే.. ఎన్ని కష్టాలు పడైనా అమెరికాలో సెటిల్ అవ్వాలని, కనీసం ఉద్యోగం చేయాలని కలలుకంటారు. కానీ, అలాంటి అమెరికా కూడా ఇప్పుడు సాధారణ దేశాల్లాగే వణికిపోతోంది. కరోనా కాటు అగ్రరాజ్యాన్ని భయపెడుతోంది.  ఇప్పటికే చైనా, ఇటలీ అనుభవాలు కళ్లముందు కనిపిస్తుంటే అగ్రరాజ్యం తన పరిస్తితేంటా అని వణికిపోతోంది. 

 

పెరిగిపోతున్న కేసులతో న్యూయార్క్ స్టేట్ మొత్తాన్ని మూసేశారు. బయటకు రావొద్దని జనాలకు సూచిస్తున్నా ఎవరూ మాట వినకపోతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అత్యవసరాలు తప్ప మిగతా అన్నింటినీ క్లోజ్ చేశారు. జనాలు ఎవరూ బయటకు రావొద్దని, అనవసరంగా తిరగొద్దని సూచించారు. టైమ్స్‌ స్క్వేర్‌ తో పాటు అన్ని ప్రముఖ ప్రాంతాలను మూసేశారు. అత్యవసర సేవల్లో ఉన్నావారు తప్ప ఎవరూ డ్యూటీలకు వెళ్లొద్దని ప్రకటించారు. న్యూయార్క్ లో దాదాపు 17వేల కేసులు నమోదైతే, 150 మంది పైగా మరణాలు నమోదయ్యాయి. కొత్త కేసులు ఒక్క రోజులోనే వెయ్యికిపైగా రికార్డవటం సంచలనంగా మారింది. 

 

న్యూయార్క్ అమెరికాలో కరోనాకు కేంద్రంగా మారితే, ఈ లిస్టులో వాషింగ్టన్, న్యూ జెర్సీ, కాలిఫోర్నియా, ఇల్లినాయీ, మిషిగన్, ఫ్లోరిడా, లూసియానా , టెక్సాస్, మసాచుసెట్స్ మొదలైన రాష్ట్రాలున్నాయి. ఇప్పటికే  కాలిఫోర్నియా, కనెక్టికట్, ఇల్లినాయీ, న్యూజెర్సీ వంటి రాష్ట్రాలూ లాక్‌ డౌన్‌  ప్రకటించాయి. 

 

కేసులు, మరణాల సంఖ్యను రాష్ట్రాల వారీగా చూస్తే, న్యూయార్క్ తర్వాత రెండో స్థానంలో ఉన్న వాషింగ్టన్ లో దాదాపు 200 కేసులు నమోదయితే, దాదాపు వంద మరణాలు రికార్డయ్యాయి. ఇక తెలుగువారు ఎక్కువగా ఉండే న్యూజెర్సీలో దాదాపు 2వేల కేసులు నమోదైతే, 21 మంది ఇక్కడ చనిపోయారు. 

 

కాలిఫోర్నియాలో 1800 కేసులు 35 మరణాలు నమోదయ్యాయి.  ఇల్లినాయీ, మిషిగన్, ఫ్లోరిడా రాష్ట్రాల్లో వెయ్యికిపైగా కేసులు, నమోదయ్యాయి. ఈ రాష్ట్రాల్లో మృతుల సంఖ్య డబుల్ డిజిట్ ను చేరుతోంది. ఇక లూసియానా, టెక్సాస్,  మసాచుసెట్స్, జార్జియా, కొలరాడో, టెన్నెస్సీ, పెన్సిల్వేనియా, మొదలైన రాష్ట్రాల్లో 500పైగా కేసులు నమోదయ్యాయి. విస్కాన్సిన్, ఓహియో, కనెక్టికట్, నార్త్ కరోలినా, మేరీల్యాండ్, వర్జీనియా, మిస్సిసిపి, ఇండియానా, సౌత్ కరోలినా, నెవాడా, మిన్నెసోటా మొదలైన రాష్ట్రాల్లో వందకుపైగా నమోదైన కేసులు మరింత వేగంగా పెరుగుతున్నాయి. 

 

నిన్నటిదాకా సింగిల్ డిజిట్‌ లో కేసులున్న అనేక రాష్ట్రాల్లో ఇప్పుడు మూడంకెలకు చేరుకున్నాయి. ఆర్కన్సాస్, అలబామా, అరిజోనా, మిస్సోరీ, కొలంబియా, కెంటకీ, మొదలైన రాష్ట్రాల్లో ఇప్పటికే వందకుపైగా కేసులు నమోదయ్యాయి. దాదాపు అన్ని అమెరికా రాష్ట్రాల్లో మరణాలు రికార్డవుతున్నాయి. ఇప్పటివరకు అమెరికాలో మొత్తం మరణాల సంఖ్య  450 దాటింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశాన్ని కరోనావైరస్ ఆందోళనకు గురిచేస్తోంది.

 

మున్ముందు పరిస్థితి ఇంకెంత విషమంగా మారుతుందో, ఈ సంక్షోభం ఎంతకాలం కొనసాగుతుందో ఎవరికీ తెలియదు. ప్రపంచంలోనే సూపర్ పవర్‌ గా భావించే అమెరికా ఇప్పుడు నిస్సహాయంగా మిగిలిపోవడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ప్రపంచంలో ఏ మూలనైనా, ఏ అంశంపైనా అమెరికా నిర్ణయాలు తీసుకుంటుంది. తమ దేశ సరిహద్దుల బయటకూడా ఆధిపత్యం  ప్రదర్శించే అమెరికా, కంటికి కనపడని శత్రువుని చూసి భయపడుతోంది. 

 

పరిస్థితి చేయి దాటితే అమెరికా జనాభాలో సగం మంది కోవిడ్-19 బారిన పడి, పది లక్షల మందికి పైగా ప్రజలు చనిపోవచ్చనే అంచనాలున్నాయి. కరోనా వైరస్ చైనాలో కొన్ని నెలల క్రితం మొదలైనా, వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు చైనా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: