టెస్ట్‌ కిట్‌ లు లేవు. గ్లౌస్‌ లు లేవు.. డాక్టర్లకు గౌన్ లు లేవు.. ఐసీయూ బెడ్‌ లు, వెంటిలేటర్లు కూడా లేవు. ఇదంతా ఇండియా పరిస్థితి కాదు. అగ్రరాజ్యంగా పెత్తనం చేసే అమెరికాలో కనిపిస్తున్న దుస్థితి. పెరుగుతున్న కరోనా కేసులతో ఫ్యూచరేంటా అని అమెరికాలో డాక్టర్లే ఆందోళనచెందుతున్నారు.  నేనున్నా అని ట్రంప్‌ భరోసా ఇస్తున్నా, అమెరికా హెల్త్‌ సిస్టమ్‌ కుప్పకూలుతుందా అనే అనుమానాలే పెరుగుతున్నాయి. 

 

అగ్రరాజ్యం ఆయుధాల్లోనే కానీ, ఆరోగ్యంలో కాదని రుజువు చేసుకుంటోంది అమెరికా. కరోనాకు బలవుతున్న దేశాలను చూసి అమెరికా వణికిపోతోంది. ఆఖరికి టెస్ట్ కిట్లు కూడా లేకపోవటం, మాస్కులు, గౌన్ల కొరత అన్నీ కలిసి అగ్రరాజ్యం ప్రమాదం అంచున ఉందని హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే పరిస్తితి ఛాలెంజింగ్గా మారిందని స్వయంగా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిస్తున్నారు. మరో రెండు వారాల్లో పెద్దన్నకు అసలైన కష్టకాలం మొదలవుతుందని అంచనాలున్నాయి. ఈ లోగా జాగ్రత్తపడి కేసుల సంఖ్యను తగ్గించుకోగలదా? ఈలోపు వాక్సిన్ అందుబాటులోకి తీసుకురాగలరా? ఇవే ఇప్పుడు ట్రంప్ ముందున్న సవాళ్లు. లేదంటే ఇటలీలో ఇప్పుడు కనిపిస్తున్న దృశ్యం రేపు అమెరికాలో రిపీట్ అవుతుందనే అంచనాలున్నాయి. 

 

ట్రంప్ ఎంత బీరాలు పలుకుతున్నా, అమెరికాలో క్షేత్ర స్థాయిలో పరిస్థితి క్లిష్టంగా ఉందని అక్కడి వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ సూపర్ పవర్ గా చెప్పుకునే అమెరికా, కరోనావైరస్ దెబ్బకు అతలాకుతలమయ్యే అవకాశాలున్నాయని సమాచారం. దాదాపు మూడు వారాల క్రితం వాషింగ్టన్ లో మొదలై, అన్ని రాష్ట్రాలకు పాకిన కరోనా వైరస్ అమెరికాని అతలాకుతలం చేస్తోంది. తీవ్రమైన వ్యాధితో హాస్పిటల్ అడ్మిషన్లు అవసరం ఉన్నవాళ్లను తప్ప, అనుమానితులను  టెస్ట్ చేయడానికి కిట్స్ కొరత వేధిస్తోంది. స్టేట్ హెల్త్ డిపార్ట్ మెంట్ నుండి అఫీషియల్ గా ఆస్పత్రులకు కిట్ ల కొరతపై వచ్చిన సమాచారం డాక్టర్లను ఆందోళనలో పడేసింది. మరోపక్క వైద్యులకు అవసరమైన దూది, గ్లౌజులు, మాస్కులు, గౌన్లకు కూడా అమెరికాలో కొరత ఉంది. దీనివల్ల కరోనా పరీక్షలు అంత వేగంగా జరగడం లేదని నివేదికలు చెబుతున్నాయి. అంటే కరోనా వైరస్ వచ్చిన వారిలో తేలికపాటి వ్యాధిలక్షణాలు ఉండే 80% మందిని టెస్ట్ చేయడానికి అమెరికాలో అవసరమైన సరంజామా లేదు. అంటే కరోనా  ఉన్న వాళ్లందరినీ గుర్తించి వేరు చేసే అవకాశం స్వయంగా అమెరికాలోనే కనిపించటం లేదు. దీంతో, వాళ్లు యధావిధిగా వైరస్ ని వ్యాపింపచేస్తూ పోయే ప్రమాదం ఉంది. అంటే ప్రస్తుతం న్యూస్ లో చెప్పే నంబర్లన్నీ అర్థం లేనివనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. టెస్టులు చేయలేని పరిస్తితే లేకపోతే పాజిటివ్, నెగెటివ్ లెక్కలకు వాలిడిటీ ఉండే ఛాన్సే లేదు.  

 

నిజానికి పేషెంట్లను గుర్తించి వారిని క్వారంటైన్ చేయలేని ఈ పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తిని వీలయినంత తగ్గించడం మాత్రమే పరిష్కారం. అయితే, అది చేయగలిగింది సోషల్ డిస్టన్సింగ్ తో మాత్రమే. అంటే మనుషులను ఐసోలేట్ చేయటం, సోషల్ ఈవెంట్స్ రద్దు చేయటం, మనుషులు సమూహాల్లో, గుంపుల్లో కలవకుండా నివారించడమే మార్గం. అమెరికాలో దాదాపు అన్ని రాష్ట్రాలు ఇప్పుడు ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. కానీ, ఇంకా పూర్తిస్థాయిలో అమెరికా లాక్ డౌన్ కాలేదు. దీంతో ప్రమాదం రోజురోజుకి పెరుగుతోంది. 

 

ఇప్పటికే అమెరికాలో పలు ఆస్పత్రులు ఇతర కేసులు చూడటం నిలిపివేశాయి. కేవలం కరోనా కేసుల్ని మాత్రమే అటెండ్ అవుతూ మిగిలిన కేసుల్ని వాయిదా వేస్తున్నాయి. అయితే ఇక్కడ మరో ప్రమాదం ఉంది. కరోనా రోగుల సంఖ్య ప్రతి ఆరు రోజులకు రెట్టింపు అవుతుంది. ఈ అంచనాల ప్రకారం... వచ్చే రెండు వారాల్లో అమెరికాలో కరోనా రోగుల సంఖ్య లక్షదాటినా ఆశ్చర్యపడనక్కర్లేదు. ఇదే జరిగితే అక్కడి వైద్య వ్యవస్థ కుప్పకూలటం ఖాయం. ఇటలీలో సరిగ్గా ఇదే జరిగింది. పెరుగుతున్న కేసులకు తగ్గట్టుగా ఆస్పత్రులు, డాక్టర్లు, సదుపాయాలు లేక అక్కడ మరణాలు అనూహ్యంగా పెరిగాయి.

 

పైగా వైరస్ సోకిన ప్రతి వంద మందిలో 10 నుంచి 20 మందికి హాస్పిటల్ అడ్మిషన్ అవసరమవుతుంది, అంటే పది లక్షల మందికి వైరస్ వస్తే, లక్ష మందికి హాస్పిటల్ అడ్మిషన్ అవసరం అవుతుంది, అందులో 20,000 మందికి ఐసీయూ, వెంటిలేటర్ సదుపాయాలు కచ్చితంగా అవసరం.  లేదంటే ప్రాణాలకే ప్రమాదం ఉండే ఛాన్స్ ఉంది. అమెరికాలో ప్రస్తుతం సుమారు 45,000  ఐసీయూ బెడ్స్, 160,000 వెంటిలేటర్స్ మాత్రమే ఉన్నాయి.  ఈ లెక్కలను గమనిస్తే, అక్కడి వైద్య వ్యవస్థ కొలాప్స్ కావటానికి రెండు మూడు వారాలు కూడా పట్టదు.  అదే జరిగితే, ఇటలీలో లాగా అమెరికాలో కూడా వైద్య సదుపాయాలు సరిపోక ఎవరికి ఆక్సిజెన్ ఇవ్వాలి, ఎవరిని వెంటిలేటర్ మీద మీద పెట్టాలి అని వైద్యులు చాలా కష్టమైన నిర్ణయాలు తీస్కుకోవాల్సి వస్తుంది. అంటే బతికించే అవకాశం ఉన్నా, సదుపాయాలు లేక బతికించలేని పరిస్థితి ఏర్పడనుందనే ఆందోళన వైద్యుల్లో వ్యక్తమవుతోంది. 

 

మరో సమస్యేమిటంటే, అమెరికాలో ప్రభుత్వ ఆసుపత్రులు ఉండవు. అన్నీ ప్రయివేటువే. కొన్ని మిలటరీ హాస్పిటల్స్ మాత్రమే ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో పేషెంట్లు ఎక్కువయితే సైనిక ఆసుపత్రులు కూడా ఏమీ చేయలేవు. ఇదీ అగ్రరాజ్యం అమెరికాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి. అయితే ట్రంప్ సర్కారు పరిస్థితులను మెరుగు పరుస్తున్నామని, అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ప్రజలకు చెప్తోంది. అవసరమైన సరంజామాను సరఫరా చేస్తామని భరోసా ఇస్తోంది.

 

కరోనా సోకిన వారిలో 80% మందిపైగా  తేలికపాటి దగ్గు, జ్వరంతో కోలుకుంటారు. వారిలో10-20 శాతం మందికి మాత్రమే హాస్పిటల్ అడ్మిషన్ అవసరమవుతుంది. ఈ పరిస్తితుల్లో ఒకేసారి కేసులు పెరిగితే, ఐసీయూలు, వెంటిలేటర్స్ సరిపోక ప్రాణహాని జరుగుతుంది. ఈ పరిస్థితులను గుర్తించిన అమెరికా వైద్యులు పూర్తిస్థాయిలో లాక్ డౌన్ చేసి, సెల్ఫ్ క్వారంటైన్ చేయాలని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: