చైనా కష్టకాలంలో ఉన్నప్పుడు చోద్యం చూశారు. ఇప్పుడు తమదాకా వచ్చింది. అటు చైనా నిర్లక్ష్యంగా వ్యవహరించింది అనే విషయం ఎంత నిజమో... వైరస్‌ తమదాకా రాదని గుడ్డిగా భావించిన అమెరికా, యూరప్‌ దేశాల నిర్లక్ష్యమూ అంతే నిజం. ఇప్పుడు కళ్లముందు వేల కేసులు.. వందల మరణాలు.. సవాల్‌ గా మారుతున్న రాబోయే కాలం.. ఇవన్నీ అగ్రరాజ్యాన్ని వణికిస్తున్నాయి. ఏం జరుగుతుందా అనే ఆందోళనలో పడేసి.. కోట్లాది అమెరికన్లలో ఆందోళన నింపింది. 

 

చెప్పటానికి అగ్రరాజ్యమే. కానీ, కరోనాకు లోకువవుతోంది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ అమెరికానూ గడగడలాడిస్తోంది. ఇటలీ స్థాయిలో కేసులు పెరిగితే పరిస్థితేంటని ఆందోళన చెందుతోంది. వైట్ హౌస్ లోనే కరోనా పాజిటివ్ కేసు నమోదు కావటం సంచలనం కలిగించింది.  కరోనా ప్రాథమిక దశలో ఉండగానే.. చైనా ప్రపంచానికి చెప్పకుండా చేసిన తప్పుకు ప్రపంచం భారీ మూల్యం చెల్లిస్తోందని ట్రంప్ మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితికి చైనాదే బాధ్యతని విరుచుకుపడుతున్నారు. అమెరికా తమ పోరాటాన్ని తగ్గించి  చూపే ప్రయత్నం చేస్తోందని,  నెపాన్ని తమపై నెట్టేస్తున్నారని చైనా కౌంటర్ ఇస్తోంది.

 

తప్పెవరిదైనా ఇప్పడు కరోనా చైనాలో కంట్రోల్‌ అయింది. యూరప్‌ తో సహా, అమెరికా కూడా నానా తంటాలు పడుతున్నాయి. ఇప్పుడు వరుసగా అనేక రాష్ట్రాలు లాక్ డౌన్ అవుతుండటంతో అమెరికాలో కరోనా వ్యాప్తికి కాస్త అడ్డుకట్ట పడినట్టు కనిపిస్తున్నా, ఇప్పటికే కరోనా బారిన పడ్డ వారినుంచి వ్యాపించే అవకాశాలు తగ్గలేదు. కానీ, మరోపక్క కొన్ని తీరప్రాంతాల్లో కరోనాను లెక్కచేయకుండా పార్టీలు, బీచ్ లలో సెలబ్రేషన్స్ కూడా నడవటం ఆందోళన కలిగిస్తున్న పరిణామం. 

 

అయితే వేలాది మంది ప్రయాణికులతో కిటకిటలాడే న్యూయార్క్, శాన్‌ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజెల్స్, సియాటిల్, షికాగో విమానాశ్రయాలు ఇప్పుడు నిశ్శబ్దంగా కనిపిస్తున్నాయి.  సిలికాన్ వ్యాలీగా పేరొందిన శాన్ జోస్, శాన్ ఫ్రాన్సిస్కో లో పనిచేసే వేలాది మంది ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచే స్తుండటంతో రోడ్లు నిర్మానుష్యంగా మారిపోయాయి. రద్దీగా ఉండే న్యూయార్క్ లో అత్యవసర సర్వీసులకు చెందిన ఉద్యోగులు మాత్రమే రోడ్లపై కనిపిస్తున్నారు. 

 

కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూజెర్సీల్లో భారతీయులు లక్షల్లో నివసిస్తున్నారు. వీరంతా ఇప్పుడు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ ప్రాంతాల్లో దుకాణాలు కూడా పూర్తిగా మూతపడ్డాయి. మరోవైపు యూఎస్ లోని ఇండియన్ ఎంబసీ ప్రవాస భారతీయులకు కీలక సూచనలు చేసింది. వ్యక్తిగత శుభ్రత, సామాజిక దూరాన్ని పాటించాలని సూచించింది. అమెరికాలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్నందున ఇళ్లకే పరిమితం కావాలని సూచించింది. ఎవరికీ వారు స్వీయ గృహ నిర్బంధాలు పాటించాలని కోరింది. ముందు జాగ్రత్త చర్యలతోనే కరోనాను కట్టడి చేయగలమని ఎంబసీ సూచించింది. 

 

ఓవరాల్ గా ప్రపంచాన్ని గడగడలాండించే అగ్రరాజ్యం అమెరికాను కరోనా భయం వణికిస్తోంది. కరోనా కేసులు పెరక్కుండా విశ్వప్రయత్నాలు చేస్తోంది. కానీ, ఏ మాత్రం సన్నద్ధంగా లేకపోవటం అమెరికాకు మైనస్ గా మారుతోంది. ఇటలీ స్థాయిలో విస్తరిస్తే కరోనాను అదుపు చేయటం సాధ్యమేనా అని మల్లగుల్లాలు పడుతోంది. ఎన్నికల ఏడాది కావటంతో ట్రంప్ సర్కారుకు ఇది ఓ సవాల్ గా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంతకాలం ఉగ్రవాదంపై పోరు అంటూ ప్రపంచ దేశాలతో తన ప్రయోజనాల కోసం ఆధిపత్యం చేసిన అమెరికా ఇప్పుడు కరోనా తమ పౌరులను కబళించకుండా జాగ్రత్తలు తీసుకునే బాటలో ఉంది. 

 

చైనాలో వ్యాపిస్తున్నపుడు చోద్యం చూసిన అమెరికా ఇప్పుడు ఒక్కసారిగా తేరుకుని ఏం చేయాలా అని తంటాలు పడుతోంది. చైనా, ఇటలీ స్థాయిలో వ్యాపిస్తే పరిస్థితి అదుపు చేయటం కష్టమని అగ్రరాజ్యానికి కూడా బాగా తెలుసు. అందుకే ఎక్కడికక్కడ పౌరుల కదలికలను నియంత్రించి ఇళ్లకే పరిమితం చేసే ప్రయత్నాల్లో ఉంది. 

 

మరోవైపు అమెరికాలో ఇన్సూరెన్స్  లేని వారి పరిస్థితి కష్టంగా మారింది. అమెరికాలో 8.5 శాతంమందికి హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. సహాయ శిబిరాలు, ఆశ్రయాలు, వీధుల్లో నివసించే నిరాశ్రయులు  5 లక్షల మంది పైగా   ఉంటారు. వీరంతా కరోనా బారినపడే ప్రమాదంలో ఉన్నారు. 

 

అమెరికాలో ఆదివారం ఒక్క రోజే 9 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే  వేలాది మంది ప్రజల్లో కరోనా లక్షణాలు కనపడుతున్నాయి. ఆ ఒక్క రోజే అమెరికాలో వంద మందికి పైగా కరోనా తీవ్రతకు ప్రాణాలు కోల్పోయారు. ఇదంతా చూస్తే, త్వరలో అక్కడ పరిస్థితి చేయి దాటేలా కనిపిస్తోంది. అమెరికా ప్రభుత్వం ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా వ్యాపించటం మాత్రం ఆగడం లేదనే చెప్పాలి. చివరికి అమెరికాలో కూడా ప్రజలు కరోనానుండి బయటపడి బతికితే చాలనుకునే పరిస్థితి ఏర్పడింది.

 

అయితే కరోనాకు మందు కనుక్కునే దిశగా అడుగులు వేస్తున్న అమెరికా ఇప్పటి వరకు పురోగతి సాధించ లేదు. ఇప్పటివరకు దాదాపు 40 వేల కేసులు  నమోదయ్యాయి. సాక్షాత్తు వైట్ హౌస్ ఉద్యోగికి కూడా కరోనా సోకింది. ట్రంప్‌ కూడా పరీక్షలు చేయింకున్న పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇప్పుడీ మహమ్మారి నుంచి కాపాడుకోటానికి అమెరికా నానా కష్టాలు పడుతోంది. ప్రపంచానికి పెద్దన్న లాంటి అమెరికా ఇప్పుడు కరోనాను  ఏ విధంగా దీనిని ఎదుర్కుంటుంది అనేది చెప్పలేని పరిస్థితి. 

 

అదే సమయంలో న్యూయార్క్ నగరం సహా వైరస్ వ్యాపించిన ఇతర రాష్ట్రాల్లో అత్యవసరమైన వైద్య సామాగ్రి కొరత ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కలకలం కొనసాగుతున్న వేళ పలు దేశాల్లో అగ్రరాజ్యంలోనే మెడికల్‌ కిట్‌ లు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మిన్నియాపొలిస్, ఒక్లహామా సిటీ తదితర నగరాల్లో ఆరోగ్య సిబ్బంది విరాళాలు కోరడం అక్కడి పరిస్థితిని చెప్తోంది. అయితే, కేసుల సంఖ్య పెరుగుతున్నా, కరోనా మరణాల సంఖ్య మాత్రం ఇతర దేశాలతో పోలిస్తే, కొంత తక్కువగానే ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: