దేశంలో కరోనా బాధితుల సంఖ్య 499కు చేరింది. మహారాష్ట్రలో కరోనా పంజా విసురుతోంది. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 97కు చేరింది. రాష్ట్రంలో అన్ని రకాల ప్రజా రవాణా వ్యవస్థలు నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య పదికి చేరడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. దేశంలో నిన్న ఒక్కరోజే 103 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. కేరళ, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలలో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. 
 
కేంద్రం కరోనా కట్టడిలో భాగంగా ఇప్పటికే పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలలో, కేంద్రపాలిత ప్రాంతాలలో లాక్ డౌన్ కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. విదేశాల నుంచి దేశంలోకి వచ్చిన వారు నిర్భంధంలోనే ఉండాలని కేంద్రం సూచిస్తోంది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా కరోనా భారీన పడి 10 మంది మృతి చెందారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేసింది. 
 
రాష్ట్రంలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. అత్యవసర సేవలకు మాత్రమే ప్రభుత్వం అనుమతిస్తోంది. జిల్లా సరిహద్దులను కూడా ప్రభుత్వం మూసివేసింది. మరోవైపు తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33కు చేరగా ఏపీలో 7కు చేరింది. తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతున్నా రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. 
 
కొంతమంది ప్రజలు నిబంధనలను సరిగ్గా పాటించటం లేదని వార్తలు రావడంతో తెలుగు రాష్ట్రాల సీఎంలు లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై ఇరు రాష్ట్రాల్లో కేసులు నమోదు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం కరోనా నియంత్రణ కోసం ఆశా వర్కర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులు, గ్రామ వాలంటీర్ల సేవలను వినియోగించుకుంటోంది. తెలంగాణ ప్రభుత్వం సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆస్పత్రులు, మెడికల్ షాపులు మినహా ఇతర దుకాణాలకు అనుమతులు లేవని స్పష్టం చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: