మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఏపీ అసెంబ్లీ సమావేశాలపై ప్రభుత్వం పునరాలోచించుకోవాలని అన్నారు. ప్రజలు డిజిటల్ వర్క్ చేసుకోగలిగితే కరోనా నుంచి బయటపడతామని చెప్పారు. కరోనా వల్ల ఆర్థిక పరిస్థితి దెబ్బ తినే అవకాశం ఉందని పేర్కొన్నారు. కేంద్రం హెచ్చరికలను ప్రజలతో పాటు ప్రభుత్వాలు పాటించాలని పేర్కొన్నారు. 
 
ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని చంద్రబాబు సూచించారు. కరోనా వల్ల వ్యవసాయం, కోళ్ల పరిశ్రమ దెబ్బ తిన్నాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటించాలని పిలుపునిచ్చారు. హుద్ హుద్ సమయంలో టీడీపీ 50 కేజీల బియ్యం, 5 లీటర్ల కిరోసిన్, 2 కేజీల కందిపప్పు, లీటర్ పామాయిల్, 500 గ్రాముల కారంపొడి , 4000 రూపాయలు ఇచ్చామని ప్రభుత్వానికి గుర్తు చేశారు. 
 
రాష్ట్రంలోని పేద ప్రజలను ఆదుకోవడానికి వైసీపీ ప్రత్యేకమైన ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం ఇంటింటికీ నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వానికి సూచించారు. చైనాలో మొదలైన ఈ వైరస్ 67 రోజుల్లో లక్షకు చేరిందని అక్కడినుండి 11 రోజుల్లో రెండు లక్షలకు చేరిందని కరోనా ప్రభావం ఇదే విధంగా ఉంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ప్రజలు ఆలోచించాలని కోరారు. 
 
కేరళ, తెలంగాణ రాష్ట్రాలు ఇస్తున్న విధంగా ఏపీ ప్రజలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వాలు కరోనా విషయంలో బాధ్యత తీసుకోవాలని సూచించారు. విదేశాల నుంచి వచ్చినవాళ్లను ముందుగానే క్వారంటైన్ చేయాల్సి ఉందని అన్నారు. ఇండియాలో కరోనాను కట్టడి చేయగలిగితే దేశ ఖ్యాతి పెరుగుతుందని చెప్పారు. నిత్యావసరాల వస్తువుల ధరలను అదుపు చేయాలని సూచించారు. ఉపాధి హామీ కూలీలకు ప్రభుత్వం సాయం చేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. లాక్ డౌన్ ను ప్రజలందరూ తప్పనిసరిగా ఫాలో కావాలని చంద్రబాబు కోరారు.      

మరింత సమాచారం తెలుసుకోండి: