అవును. మీరు వింటున్నది నిజమే. లాక్‌డౌన్, క్వారంటైన్ నియమాలను ఉల్లంఘించిన వారికి భారీ మొత్తంలో జరిమానాలు విధిస్తున్నారు. ఇలాంటివి జరగాల్సిందే.. ఎందుకంటే, ప్రభుత్వాలు ఎంత మొత్తుకున్నా.. మనుషులెవరూ మాటలు వినడం లేదు. కరోనా ఒక బూటకం అన్నట్లు, బైకులేసుకుని రోడ్ల మీద పడుతున్నారు. అయితే మన దగ్గర ఇలాంటివారిని తిట్టి, ఇంటికి పంపేస్తున్నారు. కానీ, కొన్ని దేశాలు ఈ చర్యలను.. చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాయి.

 

అకారణంగా... బయట కనిపిస్తే అరెస్టులు చేస్తున్నారు, లేదా భారీ జరిమానా విధిస్తున్నారు. ప్రపంచమంతటా.. కరోనా సుమారు 3,80,000 మందికి సోకగా.. 16 వేల మంది మరణించారు. ఇలాంటి క్లిష్ట  పరిస్థితుల్లో ప్రజలు కనీస నియమాలు పాటించకపోవడం, ప్రభుత్వాలకు ఇపుడు సవాలుగా మారింది. జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, అమెరికా దేశాల్లో యువత ‘కరోనా’ను సెలిబ్రేట్ చేసుకుంటున్నారు. కొంతమంది కాలేజ్ విద్యార్థులు బీచ్‌‌లకు వెళ్లి సన్ బాత్ చేస్తూ గుంపులుగా ఎంజాయ్ చేస్తున్నారు. 

 

ఇక ఇక్కడ కూడా మొన్న జనతా కర్ఫ్యూ తర్వాత జనాలు వీధుల్లోకి యధావిధిగా వచ్చి ఏదో సాధించిన వాళ్ళలా తెగ హడావిడి చేశారు. ప్రజలు ఒకే చోట గుమికూడదనే ఉద్దేశంతో చేసిన ‘జనతా కర్ఫ్యూ’ను మరుసటి రోజే వీరు ఉల్లంఘించడం.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు ఒకింత కష్టం కలిగింది. ఇలాంటి వ్యక్తులపై తైవాన్ వంటి దేశాలు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాయి. "హువాంగ్" అనే 35 ఏళ్ల వ్యక్తి సెల్ఫ్ క్వారంటైన్ పాటించకుండా ఓ క్లబ్‌లో డ్యాన్స్ చేస్తున్నందుకు తైవాన్ అధికారులు అతనికి అక్షరాలా... రూ.24 లక్షలు జరిమానా విధించారు. 

 

ఇక త్వరలో మన దగ్గర కూడా... ఇలాంటి మార్పులే చోటుచేసుకుంటాయి. తైవాన్‌లో ఇప్పటివరకు 195 కేసులు నమోదవ్వగా, ఇద్దరు మరణించారు. ఇక ఆ దేశం, తమ సరిహద్దులను కూడా మూసివేసింది. విదేశీయులకు అనుమతులు పూర్తిగా నిరాకరించింది. రోజురోజుకీ మనదగ్గర కూడా అలాంటి వాతావరణం  కనబడుతున్న వేళ, మన ప్రభుత్వాలు కూడా అదే విధంగా శిక్షలను అమలు చేసే ఆలోచనలో వున్నట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: