తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈరోజు మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బాధితుల సంఖ్య 36కు చేరింది. హైదరాబాద్ నగరంలో అన్ని ఏరియాలకు కరోనా విస్తరించిందని సమాచారం. నగరంలోని అన్ని ప్రాంతాల నుండి కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని సమాచారం. చందానగర్, కోకాపేట్, బేగంపేట్, ఓల్డ్ సిటీ, కూకట్ పల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, మియాపూర్, సికింద్రాబాద్, మహీంద్రహిల్స్, మణికొండ, బల్కంపేట్, సైదాబాద్, సోమాజిగూడ, గచ్చిబౌలి ప్రాంతాలకు కరోనా విస్తరించిందని తెలుస్తోంది.
 
రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. విదేశాల నుంచి వచ్చిన వారికి థర్మల్ స్క్రీనింగ్ తర్వాతే రాష్ట్రంలోకి అనుమతిస్తోంది. వైద్య, ఆరోగ్య శాఖ 868 మందిని హోం ఐసోలేషన్ లో ఉండాలని సూచించింది. ఇప్పటివరకూ రాష్ట్రంలో 850 మందికి కరోనా పరీక్షలు జరిపారు. 
 
గాంధీ, ఫీవర్ ఆస్పత్రులలో 400 మంది ఐసోలేషన్ లో ఉన్నారు. ప్రభుత్వం కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఈ నెల 31 వరకు లాక్ డౌన్ ప్రకటించింది. ప్రజలు నిర్లక్ష్యం వహించటం వల్లే రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఒక బైక్ పై ఒకరు మాత్రమే వెళ్లాలని నిబంధనలు విధించినా వాహనదారులు మాత్రం రూల్స్ పాటించటం లేదు. 
 
హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలకు కూడా కరోనా విస్తరించడం గమనార్హం. శుభ్రత పాటించి కరోనాను దూరం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ప్రజలు మాత్రం జాగ్రత్త వహించటం లేదు. తెలంగాణలో కరోనా ప్రస్తుతం రెండో దశలో ఉంది. ఈ దశ దాటితే మాత్రం పరిస్థితి ఘోరంగా ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో 97 కరోనా అనుమానితులకు రిపోర్టులు అందాల్సి ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: