ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చింది అన్నట్టుగా తమ్ముడి శోభనం అన్న అరెస్ట్ కు దారి తీసింది. అసలు ఇదంతా కరోనా ఎఫెక్ట్ కారణంగానే చోటు చేసుకోవడంతో ఇదెక్కడి తలనొప్పులు రా బాబూ అంటూ నెత్తి నోరు బాదుకున్న సంఘటన ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం అంకంపాలెం లో చోటుచేసుకుంది. ప్రస్తుతం అన్నగారు జైలు ఊచలు లెక్కపెడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తిచెందుతోంది. అది తీవ్ర స్థాయిలో విజృంభిస్తూ ఉండడంతో ప్రపంచంలో దాదాపు 171 దేశాలు అల్లాడిపోతున్నాయి. సామాజికంగా, ఆర్ధికంగా దేశాలన్నీ కుదేలయిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ప్రజలు ఎవరూ బయటకి రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 

 

IHG


ఇలా చేయడం వల్ల కరోనా వ్యాప్తి విజృంభించకుండా కాస్త అడ్డుకట్ట వేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఇంతగా కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నా జనాల్లో మాత్రం పెద్దగా మార్పు వస్తున్నట్టు కనిపించడం లేదు. కరోనా అయితే మా ఇంట్లో వేడుకలను ఆపుకోవాలా అంటూ విందులు వినోదాల్లో మునిగి తేలుతున్నారు. ఆ విధంగానే తన తమ్ముడు వివాహం అనంతరం ఏర్పాటు చేసిన శోభన కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు చేసి, చుట్టాలు, బంధువులు అందరిని పెద్ద ఎత్తున పిలిచి విందు ఏర్పాటు చేయడంతో అది కాస్తా రెవెన్యూ సిబ్బందికి తెలిసింది. బాబూ కరోనా వైరస్ ఉన్న నేపథ్యంలో విందులు ఏర్పాటు చేయడం కుదరదు.. కేవలం ఓ ఐదుగురుతో మాత్రం ఈ విందు ఏర్పాటు చేసుకోండి అంటూ నోటీసులు ఇచ్చారు. 


అయితే ఇవేమి తమకు పట్టవన్నట్టుగా యథావిధిగా విందు కార్యక్రమాన్ని కొనసాగించారు. దీంతో అతనిపై కేసు నమోదు చేశారు పోలీసులు. లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించి భోజనాలు ఏర్పాటు చేయడంతో సుధాకర్‌ను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచినట్టు సీఐ చెప్పారు. ప్రభుత్వ నిషేధ ఉత్తర్వులు, 144 సెక్షన్‌ అమలులో ఉన్న కారణంగా ఎటువంటి ఫంక్షన్లు, ఉత్సవాలు, జాతరలు నిర్వహించినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జంగారెడ్డిగూడెం సీఐ నాయక్ హెచ్చరించారు. పాపం తమ్ముడి పెళ్లి వివాహ విందుని ఘనంగా ఏర్పాటు చేస్తే ఇప్పుడు కటకటాలు లెక్కపెట్టాల్సి వచ్చింది మొర్రో అంటూ పెళ్ళికొడుకు సోదరుడు ఆకుల సుధాకర్ బోరుమంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: