ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ లాడిస్తోన్న క‌రోనా వైర‌స్ దెబ్బ‌తో అంద‌రూ హ‌డ‌లి పోతున్నారు. అయితే ఇప్పుడు కరోనా ఎఫెక్ట్‌ రాజకీయాలపై పడింది. ఇప్పటికే పొలిటికల్‌ లీడర్లు గడప దాటడం లేదు. సభలు, సమావేశాలు ఆపేశారు. అత్యవసరమైతే తప్ప మీటింగ్‌లకు హాజరుకావడం లేదు. క‌రోనా దెబ్బ‌తో సామాన్యులు అయినా త‌మ అస‌వ‌రాల కోసం బ‌య‌ట‌కు వ‌స్తున్నారేమో గాని రాజకీయ నేతలు అందరూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇక ఏపీ, తెలంగాణ‌కు చెందిన ప‌లువురు కీల‌క నేత‌లు  అంద‌రూ హైద‌రాబాద్‌కే ప‌రిమితం అవుతున్నారు. ఏదేనా ప‌ని ఉంటే హైద‌రాబాద్ నుంచి ఫోన్ల‌లో నియోజ‌క‌వ‌ర్గ నేత‌ల‌తో మాట్లాడుతూ స‌మ‌న్వయం చేసుకుంటున్నారు.



అస‌లు చాలా మంది ప్ర‌జా ప్ర‌తినిధులు నియోజ‌క‌వ‌ర్గాల వైపు క‌న్నెత్తి కూడా చూడ‌డం లేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ క‌రోనా వైర‌స్ దెబ్బ‌తో తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీ క్యాంప్ కూడా ఎత్తేసింది. టీఆర్ఎస్ ఏంటి క్యాంప్ ఎత్తేయ‌డం ఏంట‌ని షాక్ అవుతున్నారా ? అస‌లు క‌థ ఏంటంటే ఇప్పుడు నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్‌ తరపున కవిత, కాంగ్రెస్‌, బీజేపీ తరపున అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇక్క‌డ టీఆర్ఎస్‌కు తిరుగులేని బ‌లం ఉంది.. ఎన్నిక ఏక‌గ్రీవం అవుతుంద‌ని అనుకున్నా బీజేపీ , కాంగ్రెస్ నామినేష‌న్లు వేయ‌డంతో ఎన్నిక‌లు త‌ప్ప‌డం లేదు.



ఇక ఇక్క‌డ టీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కుమార్తె అయిన మాజీ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత పోటీ చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ నేతలు ఇప్పటికే స్థానిక సంస్థల నేతలను క్యాంప్‌కు తరలించారు. అయితే క్యాంపులో కరోనా కలకలం రేగింది. ఇద్దరు ప్రజా ప్రతినిధులకు కరోనా లక్షణాలు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది. దీంతో అప్రమత్తమైన అధిష్టానం క్యాంపు ఎత్తేసింది. రిస్టార్ట్‌ నుంచి నేతలను ఇంటికి పంపించింది. కరోనా ఎఫెక్ట్‌ తో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్‌ వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. ఇక కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఇప్ప‌టికే రాజ్య‌స‌భ ఎన్నిక‌ల‌ను సైతం వాయిదా వేసిన సంగ‌తి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: