మధ్య ప్రదేశ్ లో బీజేపీ అధికారం సుస్థిరం చేసుకుంది. నిన్న రాత్రి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్.. తాజాగా అసెంబ్లీలో బల నిరూపణ చేసుకున్నారు. ఆయనకు అసెంబ్లీలో 112 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. దీంతో ఇక ఆయన సీఎం పీఠం సుస్థిరం కానుంది. శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్య ప్రదేశ్ సీఎం కావడం ఇది నాలుగోసారి. ఆయన 2005, 2008, 2013లోనూ వరుసగా సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.

 

 

అయితే 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన స్వల్ప తేడాతో మెజారిటీ కోల్పోయారు. సీఎంగా రాజీనామా చేశారు. మొత్తం 230 అసెంబ్లీ స్థానాలున్న మధ్య ప్రదేశ్ లో.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 114 సీట్లు గెలుచుకోగా.. బీజేపీ 109 సీట్లు గెలుచుకుంది. సీఎం పీఠం అధిరోహించాలంటే కనీస మెజారిటీ 116 సీట్లు కావడంతో అప్పుడు శివరాజ్ సింగ్ చౌహన్ రాజీనామా చేశారు.

 

 

ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ.. బీఎస్సీ, ఎస్పీ, ఇండిపెండెంట్ల మద్దతుతో సీఎం అయ్యారు. అయితే ఇటీవల మధ్యప్రదేశ్‌ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీజేపీనేత జ్యోతిరాదిత్య సింధియాతో పాటు 22 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీని వీడారు. దీంతో కమల్‌నాథ్‌ సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కుప్పకూలిపోయింది.

 

 

అయితే ఈ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీంతో సుప్రీం కోర్టు కమల్‌నాథ్‌ను బలపరీక్షలో నెగ్గాలని ఆదేశించింది. ఆ గడువులోగా నిరూపించుకోలేని పరిస్థితుల్లో కమల్‌నాథ్ రాజీనామా చేశారు. అనంతరం గవర్నర్ బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. నేడు శివరాజ్ సింగ్ చౌహన్ అసెంబ్లీలో బలం నిరూపించుకోవడంతో ఓ రాజకీయ నాటకానికి తెరపడింది. కాంగ్రెస్ తన పాలనలో ఉన్న అతి కొద్ది రాష్ట్రాల్లో ఒక దాన్ని కోల్పోయినట్టయింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: