ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నప్పుడు మంత్రులుగా కొనసాగిన వారంతా చాలా మంది తెర‌మ‌రుగు అవుతున్నారు. అయితే కొంద‌రు మాత్రం పార్టీలు మారి తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రులుగా కొన‌సాగుతున్నారు. మ‌రి కొంద‌రు ఇటు ఏపీలో అధికార వైసీపీ నుంచి ప్ర‌స్తుతం మంత్రులుగా ఉంటే.. మ‌రి కొంద‌రు గ‌తంలో టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో మంత్రులుగా కొన‌సాగారు. ఇక మ‌రి కొంద‌రు ఏం చేయాలో తెలియ‌క రాజ‌కీయంగా అయోమ‌యంలో ఉన్నారు. ఇలాంటి నేతల్లో మాజీ మంత్రి డీఎల్‌. ర‌వీంద్రా రెడ్డి ఒక‌రు. క‌డ‌ప జిల్లాకు చెందిన ర‌వీంద్రా రెడ్డి గ‌తంలో కాంగ్రెస్‌లో ఉండేవారు.



దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఆయ‌న ఒకే జిల్లాకు చెందిన వారు అయినా వీరిద్ద‌రు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా ఇద్ద‌రికి ఏ మాత్రం ప‌డేది కాదు. వైఎస్ ముఖ్య‌మంత్రి అయిన‌ప్పుడు కూడా ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేదు. ఆ త‌ర్వాత డీఎల్ రోశ‌య్య‌, కిర‌ణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. ఆ త‌ర్వాత జ‌గ‌న్ కాంగ్రెస్ నుంచి వైసీపీ లోకి వెళ్లి క‌డ‌ప నుంచి పోటీ చేసిన‌ప్పుడు డీఎల్ స‌వాల్ చేసి మ‌రీ చిత్తుగా ఓడారు. ఇక గ‌త ఎన్నిక‌ల‌కు ముందు డీఎల్ ప‌రోక్షంగా వైసీపీకి స‌పోర్ట్ చేశారు.



ఇక ఇప్పుడు రాజ‌కీయంగా ఈ వ‌య‌స్సులో మ‌ళ్లీ ఆయ‌న యాక్టివ్ అవ్వాల‌నుకుంటున్నార‌ట‌. క‌డ‌ప జిల్లాలో కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆయ‌న‌కు ప‌ట్టు ఉంది.  మైదుకూరు నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్ప‌టికే డీఎల్ బంధువులు అంతా వైసీపీలో చేరిపోయారు. ఈ క్ర‌మంలోనే తాను ఖాళీగా ఉండ‌డం కంటే వైసీపీలో చేరితేనే స‌రైన గౌర‌వం ఉంటుద‌ని డీఎల్ భావిస్తున్నార‌ట‌. 2014 ఎన్నికల సమయంలోనే డీఎల్ రవీంద్రారెడ్డిని జగన్ స్వయంగా తమ పార్టీలో చేరాలని ఆహ్వానించారు. ఆ మేరకు చర్చలు కూడా సాగాయి. కాకపోతే అప్పుడు చేరలేదు.. ఇప్పుడు వైఎస్సార్సీపీలో చేరి క్రియాశీల రాజకీయాల్లోకి డీఎల్ రవీంద్రారెడ్డి రావ‌డం దాదాపు ఖ‌రారైంద‌ని స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: