భారత్ అంటే పెద్ద దేశం. భారత్ అంటే పురాతన దేశం. భారత్ అంటే ఎన్నో మతాలు, కులాలు ఉన్న దేశం. భారత్ అంటే ట్రెడిషన్లకు, చాదస్తాలకు పెట్టింది పేరు. ఇక భారత్ అంటే జనాభా ఎక్కువగా ఉన్న దేశం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇటలీ దేశాన్ని రెండువందల రెట్లు హెచ్చిస్తే భారత్ అవుతుంది.

 

అటువంటి భారత్ లో కరోనా ప్రవేశించింది. అయితే దాన్ని కంట్రోల్ చేయడంతో ఇప్పటివరకూ మనం చూపిస్తున్న శ్రధ్ధ, ఓపికకు ప్రపంచ ప్రశంసలు దక్కుతున్నాయి. నిన్నటి వరకూ సింగిల్ డిజిట్ లోనే మరణాల రేటుని ఉంచగలిగాం.

 


ఈ రోజుకు పదికి డెత్స్ చేరుకున్నాయి. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచకుండా నియంత్రించగలగాలి. అదే విధంగా భారత్ లో  కరోనా మరి విస్తరించకుండా మనమంతా భీషణ ప్రతిన చేయాలి. ఎవరూ ఇళ్ళ నుంచి రాము. మేము ఇంట్లో ఉండే పోరాడుతామని చెప్పాలి. ఆ విధంగా మనం చూపించే స్పూర్తి. ఇచ్చే సహకారమే కరోనాని దేశం నుంచి వెళ్ళిపోయేలా చేస్తుంది.

 

ఇపుడు ప్రపంచం అంతా భారత్ వైపే చూస్తోంది. ఆరు కోట్ల జనాభా, అందరూ చదువరులు, ఆధునిక సదుపాయాలు మెండుగా  ఉన్న ఇటలీ కరోనా బారిన పడి శవాల దిబ్బగా మారిపోయింది. అలాంటి భిన్నమైన ఆలోచనలు, వాదాలూ , భేదాలు ఎన్నో కలిగిన భారత్ ఇపుడు కరోనాని ఎలా కట్టడి చేస్తుందని అంతా అనుకున్నారు.

 

ఈ విషయంలో తొలి విజయం మనం సాధించాం. ఇదే స్పూర్తిని  మనం కంటిన్యూ చేయగలిగితే మహమ్మారి ఈ దేశం విడిచిపోతుంది. దీనికి అంతా సహాయంగా ముందుకు రావాలి. మన అబ్బాయి, అమ్మాయి అయినా విదేశాల నుంచి వచ్చేస్తే వారిని వాటేసుకుని ఇంట్లోనే ఉంచేయవద్దు. వారి వివరాలు అధికారులకు తెలియచేయలి.

 

వారికి కరోనా  ఏదీ లేదని నిర్ధారణ అయ్యాకే ఇంటికి తెచ్చుకోవాలి. ఇక్కడ మన వాడు అన్నది పైకి కనిపించే అభిమానం అయినా లోపల ఉన్నది కరోనా. అది ఎవరినీ వదలదు. వాణ్ణీ, వీణ్ణి, ఆఖరుకు  మొత్తం సమాజాన్ని పని పడుతుంది. ఆ సీన్ తెచ్చుకోవద్దు. అంతవరకూ వెళ్ళవద్దు.

 

మనం క్రికెట్ లో వరల్డ్ కప్ గెలవడం గొప్పకాదు. ఇపుడు మనం కరోనాని దేశం పొలిమేరల నుంచి తరిమేస్తే వచ్చే ఆ విజయం ఘనమైనది, చిరస్మరణీయమైనది, చరిత్రలో ఎప్పటికీ  నిలిచిపోయేది. అందుకే మనమంతా ఎవరికి వారుగా ఇళ్ళల్లో ఉంటూనే ఆశయం కోసం ఒక్కటి అవుదాం. కరోనా పీడ వదిలిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: