ప్రధాని నరేంద్రమోదీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు అర్ధరాత్రి నుంచి దేశం అంతా మూడు వారాల పాటు లాక్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇల్లు విడిచి బయటకు రావడం పూర్తిగా నిషేధం అని తెలిపారు. ఈ 21 రోజులు జాగ్రత్తలు తీసుకోకుంటే మన చేతిలో ఏమీ ఉండదని పేర్కొన్నారు. ప్రతి నగరం, ప్రతి ఊరూ, ప్రతి వీధి లాక్ డౌన్ అని ప్రకటన చేశారు. ఈ లాక్ డౌన్ నిర్ణయం ప్రతి ఇంటికి లక్ష్మణ రేఖ అని తెలిపారు.
 
దేశ ప్రజలు మార్చి 22న జనతా కర్ఫ్యూను విజయవంతం చేశారని ప్రశంసించారు. ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గడగడలాడిస్తుందని అన్నారు. ఈ వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందో ఇప్పటికే వార్తల్లో చూశామని... ప్రజలంతా సామాజిక దూరం పాటిస్తే మాత్రమే ఈ వైరస్ గండం నుంచి గట్టెక్కే పరిస్థితి నెలకొంటుందని చెప్పారు. కరోనా కారణంగా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా నిస్సహాయ పరిస్థితి నెలకొందని అన్నారు. 
 
కరోనాను కట్టడి చేయాలనే లక్ష్యంతోనే ఈరోజు అర్ధరాత్రి నుంచి లాక్ డౌన్ చేయాలని నిర్ణయం తీసుకున్నామని ప్రకటన చేశారు. ఆర్థిక వ్యవస్థపై లాక్ డౌన్ పెను ప్రభావం చూపుతోందని అన్నారు. కానీ ప్రజల ప్రాణాలను కాపాడాలంటే లాక్ డౌన్ తప్ప మరో మార్గం లేదని తెలిపారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది కర్ఫ్యూ వాతావరణమని పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. 
 
గడప దాటి ఏ ఒక్క పౌరుడు బయటకు రాకూడదని సూచించారు. దేశంలో జనతాకర్ఫ్యూను మించి లాక్ డౌన్ ను అమలు చేస్తామని చెప్పారు. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 536కు చేరింది. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. కరోనా మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంచలన నిర్ణయాలను అమలు చేస్తున్నాయి. కేంద్రం లాక్ డౌన్ ప్రకటించటంతో రేపటి నుంచి అత్యవసర సేవలు మినహా ప్రజలందరూ ఇంటికే పరిమితం కావాల్సి ఉంటుంది. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: