మంగళవారం అర్థరాత్రి నుంచి దేశమంతటా లాక్ డౌన్ ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ కరోనా తీవ్రతను మరోసారి దేశ ప్రజలకు వివరించారు. లాక్ డౌన్ అవసరాన్ని.. అది పాటించకపోతే వచ్చే నష్టాలను ప్రధాని మోడీ జాతి ముందుకు వచ్చి ప్రసంగం ద్వారా తెలియజేశారు. కొద్ది కాలంలోనే మరోసారి ప్రజల ముందుకు వచ్చిన ప్రధాని కరోనా తీవ్రతను మరీ మరీ చెప్పారు.

 

 

చేతులు జోడించి మరీ వేడుకుంటున్నానంటూ.. లాక్‌ డౌన్ అవసరాన్ని వివరించారు. 21 రోజులపాటు లాక్ డౌన్ ప్రకటించిన మోడీ అలా ఎందుకు చేయాలో చెప్పారు. కరోనా సోకినవాళ్లు తొలుత సాధారణంగానే ఉంటారని.. అలాగని ఇతరులను కలిసే ప్రయత్నం చేయవద్దని చెప్పారు. కరోనా లక్షణాలు బయటపడేందుకు కొన్ని రోజుల సమయం పడుతుంది. దానివల్ల తెలియకుండానే ఈ వ్యక్తి నుంచి ఇతరులకు సోకే ప్రమాదం ఉంది. వైరస్‌ సోకిన వ్యక్తి దాన్ని వందల మందికి వ్యాప్తింపజేయగలడని వివరించారు.

 

 

ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన విషయాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పారు. కరోనా సోకిన ఒక వ్యక్తి నుంచి 11 రోజుల వ్యవధిలో అది లక్ష మందికి విస్తరిస్తుందని తెలిపారు. అదే లక్ష మంది నుంచి రెండు లక్షలు అయ్యేందుకు కేవలం 4 రోజులు పడుతుందని.. ఇలాగే అలక్ష్యం చేస్తే దేశం మొత్తం సర్వనాశనమవుతుందని మోడీ వివరించారు. కరోనా ఎంత వేగంగా వ్యాపిస్తుందో చెప్పేందుకు ఈ గణాంకాలే ఉదాహరణగా ఆయన చూపారు.

 

 

ఇప్పటికే కరోనా ప్రభావంతో అతలాకుతమవుతున్న అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇరాన్‌ దేశాల పరిస్థితిని మోడీ ప్రజలకు వివరించారు. వైద్య ఆరోగ్య వ్యవస్థలో ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉన్న ఇటలీ.. ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉందో ఆలోచించాలని మోడీ సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో మన పరిస్థితి ఏంటి? ఈ పరిస్థితుల్లో మనకున్న ఏకైక మార్గం సామాజిక దూరం పాటించడమేనని తేల్చి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: