మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం దేశం మొత్తం లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 15వ తేదీ వరకు దేశవ్యాప్తంగా రాష్ట్రాలన్నీ షట్ డౌన్ చేస్తున్నాయి. ఇటు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా లాక్ డౌన్ కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ప్రజలు నిత్యావసర వస్తువులు, తెచ్చుకోవడానికి, ఎమర్జన్సీ విషయాలకు కొన్ని సడలింపులు ఇచ్చారు.

 

అయితే అలా కాకుండా అనవసరంగా రోడ్ల మీద తిరిగితే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇటు సీఎం కేసీఆర్ అయితే, అవసరం అనుకుంటే ఆర్మీని కూర రంగంలోకి దింపి షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ కూడా ఇస్తామని సంచలన ప్రకటన చేశారు. ఇక కరోనా వైరస్ కట్టడి చేయడంలో ప్రభుత్వాలు ఈ విధంగా ముందుకెళుతుంటే, పోలీస్ వ్యవస్థ కాస్త తక్కువగా ఉండే గ్రామాల్లో యువత... వారి ఊరుకి వారే సెక్యూరిటీగా ఉంటున్నారు. వారి ఊరికి కొత్త వారని ఎంట్రీ ఇవ్వకుండా చూసుకుంటున్నారు.

 

అలాగే తమ ఊరు వాళ్ళు ఎక్కడైనా పట్టణాలుకు వెళ్లి వస్తే, వారిని కరోనా టెస్టులు చేయించుకుని, వైరస్ లేదని తెలిశాకే ఊర్లలో అడుగుపెట్టనిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా గ్రామాల్లో యువత ఇలాగే ముందుకెళుతున్నారు. తమ తమ ఊర్లలో సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్ట్ మాదిరిగా పెట్టుకుని కొత్త వారిని ఎంటర్ కానివ్వడం లేదు. అలాగే ఊరిలో మిగతా ప్రజలని సమన్వయం చేసుకుని, నిత్యావసర వస్తువులు కూడా సరఫరా చేస్తున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మామిడిపల్లి గ్రామంలో ఇతరులు లోనికి రాకుండా ఏకంగా గేట్లు పెట్టారు.

 

ఊరి నుంచి బయటకు వెళ్లకుండా, బయట వాళ్ళు లోపలకు రాకుండా కట్టుబాట్లు విధించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.1000 జరిమాన విధించాలని నిర్ణయించారు. అటు విజయనగరం జిల్లాలో కూడా కొన్ని గ్రామాల్లో ఇలాంటి పరిస్థితే కొనసాగుతుంది. మొత్తానికైతే గ్రామీణ యువత కరోనాపై చిన్నపాటి యుద్ధమే చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: